నా కల: కెసిఆర్, బాగా చేశారని కలెక్టర్ స్మితకు కితాబు
మెదక్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా తొలిసారి గజ్వెల్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తన పెద్ద కల నిర్బంధ విద్య అని చెప్పారు. తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో.. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సభలో మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.
రాజకీయ అవినీతి అంతమైతేనే నిజమైన ప్రగతి సాధిస్తామన్నారు. తాను రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని చెప్పారు. రాజకీయ అవినీతిని అంతమొందించేందుకు, కూకటి వేళ్లతో పెకిలించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాంటి వారిని తాము ఉపేక్షించేది లేదన్నారు. దళితులు, మైనార్టీలు, గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. వీరు కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, అందులో యాభైవేల కోట్ల రూపాయలను దళితులకు ఖర్చు చేస్తామన్నారు.

తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని, ప్రభుత్వం పైన ఎంతో బాధ్యత ఉందన్నారు. కొంతమంది వ్యవసాయం దండుగ అన్నారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. తాను గజ్వెల్‌కు వచ్చే ముందు బ్యాంకుల అధికారులతో సమావేశమై అప్పుల పైన చర్చించామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ఆటో రిక్షా కార్మికులకు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. పింఛన్లు పెంచుతామన్నారు. గజ్వెల్ పట్టణానికి ఐదువేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తన పెద్ద కల నిర్బంద విద్య అన్నారు. అది నెరవేరాలంటే రెండుమూడేళ్లు పడుతుందని చెప్పారు. ఉచిత నిర్బంధ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మంత్రులు, ఉన్నత వర్గాల పిల్లలు ఏ కాన్వెంట్లలో చదువుతారో.. అదే కాన్వెంట్లలో పేద కుటుంబాల పిల్లలు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు కెసిఆర్ కితాబిచ్చారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లేందుకు భయపడేవారని, స్మితా సబర్వాలా ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యశాలలను మార్చారని, ఇప్పుడు ప్రజలు అక్కడికే వెళ్తున్నారన్నారు. మెదక్ జిల్లాలోను ఆమె కార్యక్రమాలు బాగా చేపడుతున్నారన్నారు. గజ్వెల్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతానని చెప్పారు.
గజ్వెల్‌కు రింగురోడ్డు కావాలన్నారు. అది వస్తుందన్నారు. గజ్వెల్ - ప్రజ్ఞాపూర్ రోడ్డును నాలుగైదు లైన్లుగా మారుస్తామన్నారు. ప్రజలు ఊహించని విధంగా గజ్వెల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అందరు రాజకీయాలు పక్కన పెట్టాలని కోరారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవన్నారు. తాను గజ్వెల్‌కు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. గజ్వెల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.
గజ్వెల్ నియోజకవర్గానికి తాను ఏం చేసినా తక్కవే అన్నారు. ప్రజలక కాలికి ముల్లు గుచ్చుకుంటే తాను పంటితో పీకేస్తానని చెప్పారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. 14 ఏళ్లు ఏకధాటిగా సాగిన తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అరుదైనదన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగల తర్వాత తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications