రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయండి: కెసిఆర్, ప్రత్యేక పాలసీ
హైదరాబాద్: తెలంగాణలోని పెండింగ్‌లో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జిఎం శ్రీవాస్తవ, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతోపాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు.
కాజిపేటలో రైల్వే వ్యాగన్ యూనిట్ పనులను త్వరగా ప్రారంభించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ సహా అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్ లైన్ల కోసం కృషి చేయాలన్నారు. కాజిపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను అభివృద్ధి చేయాలన్నారు. ఎంఎంటిఎస్ రైలు రెండో దశ తూప్రాన్ వరకు పొడిగించాలని, లోకల్ రైళ్లను ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ వరకు నడపాలని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధంగా ఉందని కెసిఆర్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తికి జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల కోసం ప్రత్యేక పాలసీని రూపొందిస్తామని చెప్పారు. పరిశ్రమలకు తెలంగాణ కన్నా అనుకూలమైన ప్రదేశం ఎక్కడా లభించిందని కెసిఆర్ చెప్పారు.
ఇది ఇలా ఉండగా గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంపై పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి తారక రామారావు శుక్రవారం సమీక్ష జరిపారు. వడ్డీలేని రుణాల విషయంలో అధికారులు ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బంగారుతల్లి బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు. డ్వాక్రా రుణ పరిమితి రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపుపై పరిశీలిస్తున్నామన్నారు.
స్వయం సహాయక బృందాల గ్రామ సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. పంచాయతీ వ్యవస్థ అధ్యయనానికి త్వరలో కేరళ, కర్ణాటకల్లో పర్యటించనున్నట్లు కెటిఆర్ చెప్పారు. స్త్రీనిధి బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 98 లక్షల డివిడెండ్ ఇస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications