రూ.2 కిలో బియ్యం నచ్చింది, అందుకే ఇది: కెసిఆర్
హైదరాబాద్: తనకు బాగా నచ్చిన పథకం రెండు రూపాయలకు కిలో బియ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆసరా పథకంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. పేద ప్రజల కడుపు నింపడానికే ఆసరా పథకమని ఆయన చెప్పారు. మంచి సూచనలు చేసిన ప్రతిపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అర్హులకు ఇబ్బంది కలగకుండా అనర్హులను తొలగించాలని అధికారులకు చెప్పామని ఆయన స్పష్టం చేశారు. అర్హుల ఎంపికలో శానససభ్యులు, పార్లమెంటు సభ్యుల జోక్యం లేదని ఆయన అన్నారు. ధర్మబద్దంగా పింఛను జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గతంలో రాష్ట్రంలో 24.21 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు చెప్పారు.

ఉద్యోగులందరినీ ఒకే రకంగా చూడవద్దని చెప్పామని, నిబంధనలు అర్తం కాక వర్తింపు చేయడంలో ఇబ్బందులు వచ్చాయని ఆయన అన్నారు. పన్ను చెల్లించే ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వవద్దని స్ఫష్టం చేసినట్లు, చిన్నస్థాయి అంగన్‌వాడీ ఉద్యోగులను కూడా అర్హులుగానే గుర్తించాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఆదాయ పరిమితి తక్కువగా ఉంటే పెంచాలని ఆదేశించినట్లు కెసిఆర్ చెప్పారు. సమావేశాలు ముగిసేలేపు పూర్తి వివరాలు సభకు అందిస్తామని హామీ ఇచ్చారు.
విద్యామంత్రుల సమావేశం వాయిదా
ఇదిలావుంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రుల సమావేశం వాయిదా పడింది. గురువారం సాయంత్రం తెలంగాణ విద్యామంత్రి జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి గంటా శ్రీనివాస రావు మధ్య ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమావేశం జరగాల్సి ఉండింది. జగదీష్ రెడ్డికి అత్యవసరమైన పనులు ఉండడంతో ఆ సమావేశం వాయిదా పడింది. మరోసారి సమావేశం అవుతామని గంటా చెప్పారు. తెలంగాణ షెడ్యూల్ ప్రకారమే తాము పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఓ మెట్టు దిగడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు గంటా చెప్పారు.












Click it and Unblock the Notifications