చంపి పాతరేస్తానన్నా: కెవిపిపై కెసిఆర్, నాగ్ భూములపై
హైదరాబాద్: పార్టీని బంద్ పెడితే వేల కోట్ల రూపాయలు ఇస్తానని వైయస్ హయాంలో కెవిపి రామచంద్ర రావు తనకు చెబితే చంపి పాతరేస్తానని హెచ్చరించానని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బతుకుతెరువు కోసం వచ్చిన ఆంధ్రోళ్ల జోలికి పోబోమని, వారు చక్రం తిప్పాలని చూస్తే మాత్రం సహించబోమన్నారు. సచివాలయంలో వేలు పెట్టాలని చూస్తేనే పంచాయితీ వస్తుందని తీవ్ర స్వరంతో అన్నారు.
బతకడం కోసం వచ్చి మీ ప్రత్యేకతను మీరు నిలుపుకొంటామంటే ఊరుకుంటామా? మీరంత జిద్దుగా ఉంటే మేం ఉండలేమా? మేమొచ్చి విజయవాడలో పోటీచేస్తే సహిస్తారా?' అని మండిపడ్డారు. కెసిఆర్ హైదరాబాదుతో పాటు పలు సభల్లో మాట్లాడారు. ఆంధ్రోళ్లతో శత్రుత్వం లేదని వాళ్లు తెలంగాణ వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చునని, కానీ వారి వెనకాల ఉండి రాజకీయం చేస్తున్న ఆంధ్రా నాయకులతోనే కిరికిరి అన్నారు. తెలంగాణను తెలంగాణ వాళ్లే పాలించాలన్నారు.

వైఎస్ హయాంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేత కెవిపి తనను డబ్బుతో కొనేందుకు ప్రయత్నించారని, ఉద్యమాన్ని వదిలిపెట్టి, తెరాసను మూసివేస్తే వేలకోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు అప్పట్లో పెద్దఎత్తున బేరానికి ప్రయత్నించారని, అయితే, మరోసారి ఈ విషయం మాట్లాడితే పాతరేస్తానని, పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించడంతో మళ్లీ తన జోలికి రాలేదన్నారు.
అలాంటి భేతాళ మాంత్రికుడి చేతిలో టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కీలుబొమ్మగా మారారన్నారు. ప్రెస్‌మీట్ పెట్టి తనను తిట్టడం తప్ప పొన్నాలకు, కాంగ్రెస్ నేతలకు పనేమీలేదని ఎద్దేవా చేశారు. కెవిపి పంపించే డబ్బుతో ప్రచారం చేసుకునేవారు.. అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏంచేస్తారని నిలదీశారు. ఆంధ్ర పార్టీలను సాగనంపకపోతే తెలంగాణకు నష్టమన్న ఆయన, ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని అప్రమత్తం చేశారు. పొరపాటు చేస్తే మళ్లీ ఆగమైపోతామని హెచ్చరించారు.
90 సీట్లు గెలుచుకుని తెరాస అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు బంధువులు, వైయస్ బంధువులతోపాటు సినీ హీరో నాగార్జున హైదరాబాద్‌లో అక్రమించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి చంద్రబాబు శ్రీకారం చుడితే, వైయస్ పూర్తి చేశారన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
తెలంగాణపై ఆంక్షలు వద్దని ఎంత మొత్తుకున్నా కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ ససేమిరా అన్నారని విమర్శించారు. తెరాసఅధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే బిజెపి-టిడిపి పొత్తు కుదుర్చుకున్నాయని కెసిఆర్ ఆరోపించారు. వెంకయ్య అల్లుడికి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో దళితులకు అసైన్ చేసిన 70 ఎకరాలను కట్టబెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే, ఈ భూమిని పేదలకు పంపిణీ చేస్తామన్నారు. దినేశ్ రెడ్డికి మల్కాజిగిరిపై అంత ప్రేమెందుకు? అని ప్రశ్నించారు. అక్కడి నుంచే పోటీకి దిగిన లోక్‌సత్తాను.. ఏక్‌సత్తాగా ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications