ఎందుకు చెప్పావ్, మంత్రులకి చేదు: కేసీఆర్‌కి రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. విద్యుత్ విషయంలో మూడేళ్ల పాటు ఏం చేయలేనోడివి రైతులకు నిరంతర విద్యుత్ ఇస్తానని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పావని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తీరు మార్చుకొని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలని హితవు పలికారు.
తెలంగాణలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన ఉద్యమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెరాస అధికారంలోకి వస్తే పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావించి గెలిపిస్తే.. ఇప్పుడు తెరాసనే సమస్యగా మారిందన్నారు. ఎన్నికలకు ముందు ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇంటికో నల్లా అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మరో నాలుగేళ్ల వరకు మభ్య పెట్టేందుకే ఇంటికో నల్లా అంటున్నారన్నారు.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఇంకెంతకాలం మభ్యపెట్టగలరని ప్రశ్నించారు. చంద్రబాబును తిడితే తెలంగాణ ప్రజల కడుపు నిండదన్నారు. ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ తెస్తానని చెప్పిన కేసీఆర్ దానిని ఎందుకు వాయిదా వేశారన్నారు. రైతు సమస్యల పైన ప్రభుత్వం మాట మార్చిందన్నారు. ఈ నెల 10 నుండి టీటీడీపీ బస్సుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.

రెచ్చగొట్టి కాలం గడుపుకోవడం తప్ప కేసీఆర్ ప్రజా సమస్యల పైన దృష్టి సారించడం లేదన్నారు. కేసీఆర్ తిట్ల దండకం ఎందుకన్నారు. ఎప్పుడైనా ఆయన మంచిగా మాట్లాడారా అని నిలదీశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. మోడీని, చంద్రబాబును.. ఇలా అందరి పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయన్నారు.
ఉత్తర, దక్షిణ తెలంగాణల మధ్య వైషమ్యాలు పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాస పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. ప్రజలే కాదు.. కేబినెట్ మంత్రులు కూడా సంతోషంగా లేరన్్నారు. మంత్రుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ ప్రిపరేషన్లో కేసీఆర్ మంత్రులను పక్కన పెట్టి తాపేదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మంత్రులకు సంబంధం లేకుండా బడ్జెట్ తయారవుతోందన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిపై మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ తీరు మంత్రులను అవమానపర్చినట్లే అన్నారు. కేబినెట్లో గిరిజనులకు, మహిళలకు, వెనుకబడ్డ పాలమూరుకు చోటే దక్కలేదన్నారు.












Click it and Unblock the Notifications