కెసిఆర్ ఆర్డర్: సింగపూర్ మాదిరి ‘గ్రీనరీ తెలంగాణ’
హైదరాబాద్: మూడేళ్లపాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటి రాష్ట్రాన్ని ‘హరిత హారం'గా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అటవీశాఖ ఉన్నతాధికారులతో ‘గ్రీన్ సిటీ', ‘హరిత హారం' పథకాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
మూడేళ్ల పాటు నెలలో వారం రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలెక్టర్లు, ఎస్పీలను భాగస్వామ్యులను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టవ్య్రాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు 210 కోట్ల మొక్కలు అవసరం అవుతాయని, ఆ మేరకు వాటిని సరఫరా చేయాలని అటవీశాఖ అధికారులను కెసిఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో మూడేళ్ల పాటు నిర్వహించే హరిత హారానికి 10 కోట్ల మొక్కలు అవసరం అవుతాయని, ప్రతి ఏటా 3 కోట్ల 30 లక్షల చొప్పున మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో విజయవంతం చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు.
అంతరించిపోతున్న అడవులను పరిరక్షించేందుకు ‘హరితహార' దోహద పడుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. నదీ తీరం, పరివాహక ప్రాంతం, చెరువులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హరితహారం పథకానికి నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వినియోగించుకోవాలని సూచించారు. మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని కెసిఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications