'తెలంగాణ' నుంచి 'రాయలసీమ'కు పిలుపు?
రాయలసీమపై మొదటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక అభిమానం ఉంది. సీమకు నీళ్లిచ్చే విషయంలోను సానుకూలంగా స్పందించేవారు. రాష్ట్రం విడిపోయే సమయంలో రాయల తెలంగాణ చేయాలని సీమ నాయకులు కొందరు పట్టుబట్టినప్పటికీ కుదరలేదు. తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలోను కేసీఆర్ రాయలసీమపై ప్రేమ కురిపించేవారు. రాయలసీమ రతనాల సీమగా మారాల్సిన అవసరం ఉందనేవారు.

త్వరలోనే సీమ నేతలతో కేసీఆర్ భేటీ
ఏపీలో పార్టీ పెట్టాలని కోరుతున్నారని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించేవారు. బీఆర్ఎస్ తో ఆ లోటు కూడా తీరిపోతోంది. ప్రగతి భవన్ లో త్వరలోనే రాయలసీమకు చెందిన నేతలతో సమావేశమవబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీమలో గ్రూపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలుండటంతో వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. సీమ అభివృద్ధి కోసం గళమెత్తుతున్న పలు పార్టీలకు చెందిన నేతలందరికీ పిలుపులు వెళ్లాయని, త్వరలోనే ప్రగతి భవన్ లో వారితో కేసీఆర్ భేటీ కాబోతున్నారంటున్నారు.

త్వరలోనే బీఆర్ఎస్ కార్యాచరణ
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖలో బహిరంగ సభ జరుగుతుందని ప్రకటించారు. ఈ సభ జరిగేలోపే రాయలసీమ నేతలతో కేసీఆర్ సమావేశమవనున్నారు. వీరంతా సీమకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని పోరాటం చేస్తున్నవారే. వారితో సమావేశమైన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అందుకనుగుణంగా అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

సీమలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
బీఆర్ఎస్ ద్వారా ఏపీ రాజకీయాల్లో ఎవరి ఓట్లు చీలతాయి? ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అంటూ చర్చలు జరుగుతున్నాయి. తోట చంద్రశేఖర్ ఎంపిక ద్వారా కాపులను పార్టీకి ఓటుబ్యాంకుగా చేసుకోవడంతోపాటు టీడీపీ-జనసేనకు మొగ్గుచూపుతున్న కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో నాయకులను పార్టీలో చేర్చుకొని రాజకీయం చేయడంద్వారా ఎవరికి నష్టం? ఎవరికి లాభమనేది త్వరలోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications