కెసిఆర్ గాలం: ఫిర్యాదు, డిఎస్ కళ్లెం వేయగలరా?
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవిని దక్కించుకునే వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గాలం వేస్తుంటే, దాన్ని ఆపడానికి శాసన మండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో డిఎస్ ఫలితం సాధించగలరా అనేది ప్రశ్న.
కెసిఆర్ సమక్షంలో ఇటీవల తెరాసలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలపై డిఎస్ శనివారం శాసనసభ సచివాలయ కార్యదర్శి సదారాంకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం 191(2) ప్రకారం పార్టీలు మారినవారిని కోర్టులు కూడా కాపాడలేవని డిఎస్ అన్నారు. అధిష్టానంతో చర్చించిన తర్వాతనే అనర్హత పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు.
పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్సీలపై చర్య తీసుకునే అధికారం మండలి చైర్మన్‌కు ఉందని, నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. ఎమ్మెల్సీలకు సంబంధించిన అన్ని ఆధారాలను పిటిషన్‌తో పాటు అందజేసిట్లు డిఎస్ చెప్పారు.

సీనియర్ నేత, ఎమ్మెల్సీ కెఆర్ అమోస్‌తో పాటు ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్సీలు కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను చేర్చుకుని మండలి చైర్మన్ పదవిని స్వామిగౌడ్‌కు కట్టబెట్టాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కెసిఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో ఆయన స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను మండలి చైర్మన్‌గా చేయాలనే వ్యూహంతో ఇతర పార్టీల ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications