సమైక్యంగా ఉంచితే, తెలంగాణ పేరు సరే: వైయస్ జగన్
చిత్తూరు: రాయలసీమను నిలువునా చీల్చడం కంటే అన్ని జిల్లాలను తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు సూచించారు. చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు.
రాయలసీమను విడగొట్టడం కంటే.. అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే ఎవరు వద్దంటారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజనతో వచ్చే సమస్యల గురించి వీరికి తెలుసా? అని జగన్ ప్రశ్నించారు. నదీ జిలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కిరణ్, బాబులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రజలందరూ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారని జగన్ తెలిపారు. అందువల్లనే రాష్ట్రంలో చిట్టచివరి నియోజకవర్గం కుప్పం నుంచి సమైక్య శంఖారావం పూరించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఈ యాత్ర అని ఆయన అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రాజకీయ వ్యవస్థ నుంచి దుర్మార్గులను బయటికి పంపించేద్దామని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని, రాష్ట్రం విడిపోకుండా చూస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానిని చేద్దామని ఈ సందర్భంగా జన్మోహన్ రెడ్డి అన్నారు.
జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైయస్సార్ అని నినాదాలు చేస్తూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత సమైక్య శంఖారావాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications