రఘురామ బెయిల్ తీర్పు కాపీ విడుదల-10 రోజుల గడువు-కస్టడీ విచారణకు నో
ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. అయితే తీర్పు కాపీ మాత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో పలు కీలకాంశాలు ఉన్నాయి. రఘురామరాజు పది రోజుల్లోగా సీఐడీ కోర్టులో లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అలాగే బయిల్ పొందేందుకు పలు షరతులు విధించిన న్యాయస్ధానం.. ఆయన్ను కస్టడీలో విచారించవద్దని ఆదేశాలు ఇచ్చింది.

రఘురామ బెయిల్ తీర్పు కాపీ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ నిన్న తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్ధానం ఇవాళ అందులో అంశాలను ప్రస్తావిస్తూ తీర్పు కాపీని విడుదల చేసింది. ఇందులో పలు కీలకమైన అంశాలు ఉన్నాయి. రఘురామరాజు బెయిల్ పొందేందుకు అనుసరించాల్సిన చర్యలతో పాటు బెయిల్ కండిషన్లు, సీఐడీకి సూచనలు ఇలా పలు అంశాలపై సుప్రీంకోర్టు సుదీర్ఘంగా వివరించింది. దీన్ని ఇటు రఘురామరాజుతో పాటు సీఐడీ అధికారులు కూడా పాటించాల్సి ఉంటుంది. అటు సీఐడీ కోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

రఘురామ బెయిల్ ఇలా
రఘురామకృష్ణంరాజు తన బెయిల్ కోసం ట్రయల్ కోర్టు అయిన సీఐడీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. సీఐడీ కోర్టులో పది రోజుల్లోగా లక్షరూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి ఆయన బెయిల్ పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఇలాగే ఇద్దరు హామీదారుల్ని పేర్లను కూడా సీఐడీ కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత సీఐడీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది. సోమవారం ఈ మేరకు సీఐడీ కోర్టుకు బెయిల్ పూచీకత్తు ఇతర వివరాల్ని రఘురామ లాయర్లు సమర్పిస్తారు. ఆ తర్వాత సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయనుంది.

రఘురామకు అయిన గాయాలివే
సీఐడీ కస్టడీలో వైసీపీ ఎంపీ రఘురామరాజు పాదాలకు గాయాలైనట్లు సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించింది. సికింద్రాబాద్ ఆర్మీఆస్పత్రి వైద్యులు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు తెలిపింది. అలాగే ఆయన ఎడమకాలి వేలు ఎముక విరిగినట్లు కూడా తీర్పు కాపీలో పేర్కొంది.
సీఐడీ కస్టడీలో పోలీసులు రఘురామరాజు పట్ల అనుచితంగా ప్రవర్తించి ఉండొచ్చని కూడా సుప్రీంకోర్టు తన తీర్పు కాపీలో ప్రస్తావించింది. దీంతో సీఐడీ కస్టడీలోనే ఆయనకు గాయాలైనట్లు సుప్రీంకోర్టు నిర్ధారించినట్లయింది.

రఘురామకు కస్టడీ విచారణకు నో
రఘురామకృష్ణంరాజు బెయిల్ పొందిన తర్వాత సీఐడీ విచారణాధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అలాగే విచారణ అధికారి కూడా ఆయన్ను విచారణకు 24 గంటలముందు నోటీసులు ఇచ్చి పిలవాల్సి ఉంటుందని ఆదేశించింది. అలాగే రఘురామరాజును కస్టడీలో విచారించవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయన న్యాయవాది సమక్షంలో రఘురామరాజును విచారించాలని సుప్రీం తెలిపింది. కేసుకు సంబంధించిన ఏ అంశంపైనా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, సాక్ష్యుల్ని ప్రభావితం చేయకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని రఘురామను సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications