ముచ్చటగా మూడో భర్తతో కాపురం: నమ్మించడానికి మహిళ ఇలా చేసింది...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఆస్పత్రి నుంచి శిశువు మాయమైన కేసును పోలీసులు సమర్థంగా ఛేదించారు. ఇందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోని ప్రధాన నిందితురాలు మూడో వివాహం చేసుకుందని, రెండో వివాహం చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న విషయం మూడో భర్తకు చెప్పలేదని, దీంతో గర్భం దాల్చానని నమ్మించి బిడ్డ కోసం ఆస్పత్రిలోని రికార్డ్ అసిస్టెంట్ ని ఆశ్రయించి శిశువును కిడ్పాన్ చేసిందని పోలీసులు చెప్పారు.
శిశువు అపహరణకు రికార్డ్ అసిస్టెంట్ శ్రీను ఆమెకు సహకరించాడని, బిడ్డ గురించి మీడియాలో కధనాలు చూసి కూడా భర్త చెప్పనందుకు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసామని విజయవాడ పోలీసు కమిషనర్ సవాంగ్ మీడియాకు చెప్పారు. సీసీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తులు మా వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. అరెస్టయిన వారిలో దంపతులు నాగమల్లేశ్వరి, రాజు, ఆస్పత్రి ఉద్యోగి శ్రీను, సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలు ఉన్నట్లు తెలిపారు.

నిందితులను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన సవాంగ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మగ పిల్లాడు కావాలన్న కోరికతో అవనిగడ్డకు చెందిన నాగమల్లేశ్వరి అనే మహిళ శిశువును అపహరించింది. శిశువు అపహరణకు సహకరించిన నాగమల్లేశ్వరి భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరి (27) తన బావ వీరబాబును పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. భర్తతో మనస్పర్థలు రావటంతో అతన్నుంచి విడిపోయి, హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ ఒక టైలరింగ్ షాపులో పనిచేసేది. ఆ సమయంలో రాకేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి అతడితో నాలుగేళ్లు సహజీవనం చేసింది.
తరువాత రాకేష్ వేరొక మహిళను వివాహం చేసుకోవటంతో మల్లీశ్వరి తిరిగి అవనిగడ్డకు వచ్చింది. కృష్ణాజిల్లా ఉల్లిపాలెంకు చెందిన మద్దా జ్యోతి స్వర్ణరాజు(29)ను 2015లో వివాహం చేసుకుంది. తనకు ఇంతకు ముందు పెళ్లయిన విషయాన్ని గానీ, వేరొకరితో సహజీవనం చేసిన విషయాన్నిగానీ, తనకు ట్యూబెక్టమీ ఆపరేషన అయిందనే విషయాన్ని గానీ స్వర్ణరాజుకు ఆమె చెప్పలేదు.
తనకు పిల్లలు పుట్టరనే విషయం రాజుకు తెలిస్తే వదిలిపెట్టివెళ్లిపోతాడని భయపడింది. గర్భమని నమ్మించి నాలుగు నెలల తరువాత కావాలని జారిపడి గర్భస్రావం అయినట్టు నమ్మబలికింది. మళ్లీ గర్భం నటించి, తొమ్మిది నెలలు గడిచిన తర్వాత చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లి ఆపరేషన్ చేయించుకుని వస్తానని భర్తకు చెప్పి ఈ నెల 11వ తేదీ రాత్రి చెన్నై వెళ్లింది.

అక్కడ అనేక ఆస్పత్రుల్లో మగశిశువుకోసం ప్రయత్నించి, విఫలమైంది. 13వ తేదీన విజయవాడ చేరుకుంది. నేరుగా విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అక్కడ రికార్డు అసిస్టెంట్‌ను శ్రీను(51) అనే వ్యక్తిని పరిచయం చేసుకుని ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన మగశిశువులెవరైనా ఉంటే ఇవ్వాలని అతడిని కోరింది. దీనికి అతను అంగీకరించాడు. మర్నాడు శ్రీను, సెక్యూరిటీ గార్డ్సు ముఖర్జీ, కన్నయ్యల సహాయంతో ఐతా కల్యాణి జన్మించిన ఐదురోజుల బిడ్డను అపహరించింది.
శిశువును అపహరించిన మల్లీశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విజయవాడ రైల్వేస్టేషనకు కాకుండా, కృష్ణకెనాల్ రైల్వేస్టేషన ఆటోలో వెళ్లింది. అక్కడినుంచి తెనాలి.రేపల్లె మీదుగా అవనిగడ్డలోని ఇంటికి వెళ్లిపోయింది. అయితే అప్పటికే విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువు అపహరణకు గురైందనే విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పిల్లలు లేని స్వర్ణరాజు, నాగమల్లీశ్వరి దంపతులకు నవజాత శిశువు ఎలా వచ్చిందని స్థానికులు అనుమానించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లీశ్వరిని అదుపులోకివిచారించారు. ఆస్పత్రి సిబ్బంది శ్రీను, ముఖర్జీ, కన్నయ్యలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications