కిరణ్ సహా కలిశారు: అదొక్కటే..అధిష్టానంపై సిఎం క్లారిఫై
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో ఓ వైపు రాజ్యసభ కలకలం కనిపించినప్పటికీ మరోవైపు నామినేషన్ సమయంలో అందరూ కలిసిపోయారు! తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ప్రాంతాల వారీగా విడిపోయిన కాంగ్రెసు నామినేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కటైపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామి రెడ్డిలకు కాంగ్రెసు పార్టీ రాజ్యసభకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. వారి ఎంపిక వెనుక అధిష్టానం వ్యూహాత్మక వైఖరి అవలంభించిందనే అభిప్రాయాలు పలువురిలో కనిపిస్తున్నాయి.

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంతో సమైక్యాంధ్ర పేరుతో చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వారికి మద్దతుగా నిలిచిన వారిని అధిష్టానం బుజ్జగిస్తోంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కెవిపి, ఖాన్, టిఎస్సార్‌లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తమకు మద్దతివ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా.. రెబల్ వర్గం ముందే ముఖ్యమంత్రిని కలిసి తమకు మద్దతివ్వాలని కోరిందట. అయితే వారికి కిరణ్ ససేమీరా అన్నారట. తాను తెలంగాణ విషయంలో మాత్రమే అధిష్టానంతో విభేదిస్తున్నానని, మరే రకంగాను వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని, రాజ్యసభ ఎన్నిక విషయంలో ధిక్కరించేలా వ్యవహరించనని, తెలంగాణ వేరు, రాజ్యసభ వేరు అని వారికి నచ్చ చెప్పారట. తాను ఒక్క తెలంగాణ విషయంలో తప్పితే అధిష్టానంతో ఏ విషయంలోను విభేదించడం లేదని చెప్పారట. ఆ కారణంగానే పలువురు నేతలు మొదట రెబల్ అభ్యర్థులకు మద్దతిస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత తగ్గి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications