కిరణ్‌కూ తెలియదు, డిగ్గీ అలా చెప్పడమేంటి: టిపై హర్ష
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంపై సమాచారాన్ని తమకెవరికీ పార్టీ అధిష్టానం చెప్పలేదని, కనీసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చెప్పకుండా విభజన చేయడం బాధ కలిగించిందని కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ ఆదివారం అన్నారు. ఎపి జర్నలిస్టుల ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీలు హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హర్ష మాట్లాడారు. సిడబ్ల్యూసి తీర్మానం సరికాదన్నారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం తమకు బాధ కలిగించిందన్నారు. కాంగ్రెసు విభజనలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అందుకే సమస్య జఠిలమైందన్నారు. తాము రాజీనామాలు చేసినా ఇప్పటి వరకు వాటిని ఆమోదించక పోవడమేమిటన్నారు.

అందరికీ చెప్పి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తే సమస్య ఇంత జఠిలమయ్యేది కాదన్నారు. తమను, తమ ప్రాంత ప్రజలను బానిసల్లా చూస్తున్నారని, అందుకే కేంద్రంపై అవిశ్వాసం పెట్టామన్నారు. అధికార పార్టీలో ఉంటూ అవిశ్వాస తీర్మానం పెట్టడం చరిత్రాత్మకమన్నారు. తమకు, ముఖ్యమంత్రికి ఎవరికీ చెప్పకుండానే నిర్ణయం తీసుకొని.. ఆ తర్వాత ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల దిగ్విజయ్ సింగ్ మాత్రం తాము నిర్ణయం తీసుకున్నామని, కట్టుబడి ఉండాలని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, అందుకే తాము ప్రజల పక్షాన నిలబడదల్చుకున్నామన్నారు. సీమాంధ్రలో నాయకుడు లేకుండా ఉద్యమం జరిగిందన్నారు. ఇంకా విభజన జరగలేదని హర్ష కుమార్ అన్నారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతాన్ని బలవంతంగా తోసేస్తున్నారని దుయ్యబట్టారు. తాము స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు ఇచ్చామన్నారు.
అన్యాయం: రాయపాటి
సిడబ్ల్యూసి నిర్ణయం అన్యాయమని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. తమ ఎంపీలతో సంబంధం లేకుండా విభజన ప్రక్రియ ప్రారంభించిందన్నారు. రాష్ట్రం కోరే వారికి ఎక్కడైనా రాజధాని ఇచ్చారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications