23లోగా ఆ రెండా!: కిరణ్ రిజైన్, పార్టీపై ఊహాగానాలు
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, శాసన మండలిలో తీర్మానం చేయించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. జనవరి 3వ తేదీ నుండి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభం అయ్యాక ఉభయ సభల్లో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలనే ఆలోచనతో ఉన్నారట.
అదే సమయంలో సమావేశాలు కిరణ్ పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యారట. జనవరి 23వ తారీఖులోగా విభజన బిల్లు పైన అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు రాష్ట్రపతి సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోగా కిరణ్ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శనివారం కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ వేడుకలలో కిరణ్ పాల్గొనక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి పార్టీ పెడతారనే ప్రచారం మరింత జోరందుకుంది. కిరణ్ పార్టీ పెట్టరని కొందరు నేతలు చెబుతున్నా... ఆ వైపు కిరణ్ కసరత్తు చేస్తున్నారంటున్నారు.
ఇటీవల పెద్ద మొత్తంలో నేతలు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు... చూపుతున్నారు. కిరణ్ పార్టీపై తేల్చక పోవడం వల్లనే అందులో చాలామంది ఆ రెండు పార్టీల వైపు చూస్తున్నారు. అయితే ఇటీవల సీమాంధ్ర నేతల సమావేశంలో కిరణ్... 23వ తేదీ వరకు చూసి ఆ తర్వాత అందరం కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకుందామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు నేతలు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. కొందరు నేతలు జగన్, టిడిపి వైపు వెళ్లేందుకు నిర్ణయించుకున్నా, కిరణ్ భరోసాతో కొందరు తగ్గారని అంటున్నారు.
జనవరి 3న సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో సమైక్య తీర్మానం చేయించి, కిరణ్ రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. తద్వారా తన సమైక్యవాదాన్ని సీమాంధ్రలో బలంగా చెప్పుకోవడానికి కూడా ఉంటుందని భావిస్తున్నారట. అధిష్టానం విభజన జరగదని కిరణ్‌కు హామీ ఇస్తేనే ఆయన వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే పలుమార్లు 2014 ఎన్నికలకు ముందే విభజన జరుగుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications