బిజెపిలోకి కిరణ్ రెడ్డి?: తప్పు చేశానన్న బొత్స

బిజెపి నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమైనట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీని వీడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా అపజయం పాలైంది. ఇక ఆ పార్టీ అవసరం లేదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనంటే బిజెపిలో చేరడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులను ఢిల్లీలోని బిజెపి నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తనకు పదవి కావాలని అడిగినట్లు చెబుతున్నారు. బేషరతుగా వస్తానంటే మాత్రమే ఆలోచిస్తామని బిజెపి నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరో మార్గం లేక బేషరతుగానే బిజెపిలో చేరడానికి ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు కాంగ్రెసు ఎంపిలుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్ వంటివారు ఆయన వెంట ఉన్నారు. అయితే, వీరంతా బిజెపిలో చేరే అవకాశాలు లేవని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తూ వచ్చిన రాయపాటి సాంబశివ రావు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కాగా, రాజకీయంగా తాను పొరపాటు చేసినట్లు పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందరినీ కలుపుకుని సమైక్య ఉద్యమానికి మద్దతు పలికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని ఆయన అన్నారు.
అలా చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందని భయపడినట్లు ఆయన తెలిపారు. అందువల్లనే తాను ఆ పని చేయలేదని ఆయన అన్నారు. ఆ విధంగా తాను పొరపాటు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications