తెలంగాణకు జరిగే నష్టం గురించి చెప్తా: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: ఇక ముందు రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు జరిగే నష్టం గురించి ఎక్కువగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు రెండు ప్రాంతాలకు సంభవించిన నష్టం గురించి మాట్లాడానని, ఎక్కువగా సీమాంధ్రకు జరిగే నష్టం గురించి మాట్లాడానని, ఇక తెలంగాణకు జరిగే నష్టం గురించి వివరిస్తానని ఆయన అన్నారు. శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
విభజన వల్ల సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతం కూడా భారీగా నష్టపోతుందని, ఈ నష్టాల గురించి ఢిల్లీకి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన వల్ల తెలంగాణలో వ్యవసాయం భారంగా మారుతుందని, ఒక్క పంట వేయడానికి ఎకరాకు రూ.15 వేలు ఖర్చవుతుందని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణకు 175 మిలియన్ యూనిట్లు విద్యుత్తు కావాల్సి వస్తుందని, విభజనతో ఆ ప్రాంతంలో తీవ్ర విద్యుత్ లోటు ఏర్పడుతుందని అన్నారు.

విద్యుత్తు లోటు ఏర్పడితే ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా - 'రాష్ట్రం విడిపోతే మిగులు విద్యుత్‌ను ఎవరు ఎవరికైనా అమ్ముకుంటారని అన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో విద్యుదుత్పత్తి అంత సులువేమీ కాదన్నారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకూ సరిహద్దుగా నదులే ఉంటాయని, ఒక్క కృష్ణా నదే ఈ విధంగా 350 కిలో మీటర్లు ప్రవహిస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఒకవేళ నదిలో ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తే ఏ రాష్ట్ర పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంటుందన్నారు. విభజన వల్ల సీమాంధ్రలో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రం వేసిన సంఘాలేవీ సక్రమంగా పనిచేయలేకపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ కేటాయింపుల కన్నా కేటాయింపులు లేకుండా అనధికారికంగా విడుదల చేస్తున్న నీటి వల్లే సీమాంధ్రలో అధికంగా సాగు జరుగుతోందని చెప్పారు. పోలవరం పనులు ప్రారంభమయ్యాయని, నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేశారు.
విభజన వల్ల ప్రభుత్వ ఉద్యోగులు భారీస్థాయిలో పదోన్నతులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో, అక్కడ జరుగుతున్న పరిణామాలేమిటో మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రికి వివరించారు.












Click it and Unblock the Notifications