ఏబీఎన్, టీవీ9: మండిపడ్డ కిషన్, ఇక చాలు: పొంగులేటి
హైదరాబాద్: ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాలను నిలిపి వేయించడం ప్రభుత్వ దుందుడుకు వ్యవహారంగా ఉందని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి శనివారం ఆరోపించారు. దీర్ఘకాలంలో ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.
శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలపై చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. అందరి సహకారంతో రాష్ట్రాభివద్ధి సాధించుకోవాలి తప్ప, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచిది కాదన్నారు. చానెళ్ల హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాయడం సరికాదన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు మరో చానెల్ ప్రసారాలను నిలిపివేయడం ప్రజాస్వామ్య విర్దుధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయం మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఒక చానెల్ తీరుపై అసెంబ్లీలో తీర్మానం చేసి స్పీకర్ నిర్ణయానికి వదిలేశారన్నారు.
ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిపై కూడా కక్షకట్టి ప్రసారాలను నిలిపేయడం తగదన్నారు. కేంద్రం జోక్యం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలకు పోకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ఇన్ని రోజులపాటు ప్రసారాలు నిలిపివేసింది చాలని.. ఇక వెంటనే ప్రసారాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications