బాబు నీకంత దమ్ముంటే?, అప్పట్లో నీ లెక్క ఇది: కొడాలి నాని ఛాలెంజ్.
ఇంకా దమ్ముంది అనుకుంటే.. మొత్తం 175 స్థానాల్లో పోటికి సిద్దపడాలని, దాన్ని తాము రెఫరెండంగా భావిస్తామని చెప్పారు.
నంద్యాల: గెలిస్తే ఓ లెక్క.. ఓడితే మరో లెక్క.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థించుకోవడానికి దారులు వెతుక్కోవడం రాజకీయ పార్టీల లెక్క. నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా కొత్త లెక్కలు చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంతకన్నా దారుణ పరాజయాలు ఆయన్ను పలకరించాయని వైసీపీ నేత కొడాలి నేత అంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు. 44 స్థానాలకు ఎన్నికలు జరిగితే 21 చోట్ల డిపాజిట్ రాలేదని, 10 చోట్ల మూడో స్థానంతో సరిపెట్టుకున్నారని అన్నారు.

ఆ లెక్కన చంద్రబాబు పరాజయాలతో పోల్చుకుంటే తమదెంత? అన్న రీతిలో వైసీపీ మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కలు చెబుతూనే సీఎంపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు పోటుగాడేమీ కాదని, అంత అనుభవజ్ఞుడు కాదని విమర్శించారు.
చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే తమ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు. ఇంకా దమ్ముంది అనుకుంటే.. మొత్తం 175 స్థానాల్లో పోటికి సిద్దపడాలని, దాన్ని తాము రెఫరెండంగా భావిస్తామని చెప్పారు.
నంద్యాల ఉపఎన్నికలో 39మంది పోస్టల్ బ్యాలెట్స్ పంపితే ఒక్కటి కూడా చెల్లలేదని, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబుపై ఎంత అసంతృప్తితో ఉన్నారో ఈ విషయం స్పష్టం చేస్తుందని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సొంత నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్క దానిలో కూడా టీడీపీ గెలవలేకపోయిందన్నారు.
ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పై పోటీకి సిద్దమన్న చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైసీపీ అంచెలంచెలుగా ఎదుగుతోందని, 2019లో తమ పార్టీదే అధికారమని అన్నారు. చంద్రబాబు దొడ్డిదారిని వెతుక్కునే వ్యక్తి అని, జగన్ మాత్రం మాట తప్పని మడమ తిప్పని నాయకుడని అన్నారు.












Click it and Unblock the Notifications