ప్రతిపక్షాల కుట్రలు; ఉన్నది ఉన్నట్టు.. వైఎస్ జగన్ లక్ష్యం అదేనన్న మంత్రి కొడాలి నాని
ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాల మీద విరుచుకు పడే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని చెప్పి, వైసీపీ ప్రజా ప్రతినిధుల బాధ్యతను కొడాలి నాని గుర్తు చేశారు. ఏపీలో తాజా ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణపై కొడాలి నాని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇదే సమయంలో ఓ టి ఎస్ పైన కూడా కొడాలి నాని మరోమారు క్లారిటీ ఇచ్చారు.

ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష పార్టీల నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన రెండున్నర ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రజాదరణ లభిస్తుందని అది చూసి ఓర్చుకోలేక కావాలని కుట్రలు పన్నుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఓ టి ఎస్ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని కొడాలి నాని తెలిపారు.

ఓటీఎస్ పైన దుష్ప్రచారం .. ప్రతిపక్షాల దుర్బుద్ధికి నిదర్శనం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పనిచేస్తున్నాయని మండిపడ్డారు కొడాలి నాని. రాష్ట్రంలో 70 లక్షల మంది పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ టి ఎస్ పథకాన్ని తీసుకు వస్తే దీనిపైన కూడా దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాల దుర్బుద్ధికి నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ళ మీద యాజమాన్య హక్కులు కల్పించాలన్నదే ఓ టి ఎస్ యొక్క ప్రధాన లక్ష్యమని కొడాలి నాని వెల్లడించారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నది ఉన్నట్టు చెప్పండి
ఓటీఎస్ స్వచ్చందంగా జరుగుతున్న ప్రక్రియ అని బలవంతం లేదని చెప్పినా కొన్ని మీడియా చానళ్లు కావాలని ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అభూత కల్పనలు సృష్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని అసహనం వ్యక్తం చేశారు. అటువంటి మీడియా ఛానళ్లను ప్రజలు నమ్మబోరని తేల్చిచెప్పారు. ఇక ఇదే సమయంలో ప్రజాప్రతినిధుల బాధ్యతను గుర్తు చేసిన కొడాలి నాని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

జనవరి నుండి పించన్ 2500 ఇస్తున్నట్టు వెల్లడి; మళ్ళీ అధికారం జగన్ ఉద్దేశం
ఇచ్చిన మాట మేరకు జనవరి నుంచి పింఛన్ పెంచి 2500 రూపాయలు ఇస్తున్నట్లుగా కొడాలి నాని వెల్లడించారు. జగన్ నిరుపేదల సంక్షేమం కోసమే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసి, ప్రజల మన్ననలు పొంది మళ్లీ అధికారంలోకి రావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని కొడాలి నాని స్పష్టం చేశారు.
కానీ కావాలని ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, కొడాలి నాని విమర్శించారు. ఎవరేం చేసినా వైసీపీ నేతలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications