కోదండరామ్ సంచలనం: కెకె పేరు లీక్ చేసింది ప్రభుత్వమే, ఏమి కోపమో...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భూ కుంభకోణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పేరును ప్రభుత్వమే 'లీక్' చేసిందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు భూ కుంభకోణంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.

టి.జెఎసి విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. వెలుగు చూస్తున్న సుమారు 10 వేల కోట్ల విలువ గల భూ కుంభకోణాలపై సిటింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కెకె భూ కుంభకోణాన్ని కూడా ప్రభుత్వమే మీడియాకు లీక్ ఇచ్చిందన్నారు.

Kodandaram says KK name revealed by govt

ఆ విధంగా ఎందుకు చేస్తుందని ప్రశ్నించగా, 'ఏమి కోపం ఉండెనో..' అని ఆయన సమాధానమిచ్చారు. భూ కుంభకోణాలపై మీడియా ద్వారానే స్పందిస్తారా? అని ప్రశ్నించగా, దీనిపై తాము అడ్వకేట్స్ జెఎసితో మాట్లాడి, త్వరలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని, ఆ తర్వాత కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఆయన బదులిచ్చారు.

ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన లేదన్నారు. ప్రభుత్వం కుళ్లిపోయి, కంపుకొడుతున్నదని విమర్శించారు. ఈ నెల 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రోజున 'అమరవీరుల స్ఫూర్తి యాత్ర' చేపట్టనున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఈ యాత్ర 24న సిద్దిపేటలో ముగుస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై, ఇంకా వివిధ అంశాలు, ప్రజా సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

గ్రూపు పరీక్షా ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సై పరీక్షా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నాలుగో విడత రుణ మాఫీ పూర్తిగా చేయాలని, కొన్ని బ్యాంకులకు ఇంకా వడ్డీ కూడా చెల్లించలేదని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana JAC chairman Kodandaram said that Telangana government has leaked the name of Telangana Rastra Samithi (TRS) Rajya Sabha member K Keshav Rao in land scam.
Please Wait while comments are loading...