అయ్యో పాపం.. దురదృష్టం వెంటాడిందే!
ఏపీ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన కోలా గురువులను దురదృష్టం వెంటాడింది. 156 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ తో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన కోలా గురువులు మరపడవులు, హేచరీస్ వ్యాపారం చేస్తుంటారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో గురువులకు మంచి పేరుంది. 2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకిదిగి కేవలం 341 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గురువులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీకి దిగినప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల సమయానికి ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీలో ఉండటంతో టికెట్ అతనికి కేటాయించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిచ్చారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడతారని భావించినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో గురువులు ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన విజయవాడ నగర మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు.గెలుపొందడానికి అవసరమైన 23 మంది ఎమ్మెల్యేల ఓటు దక్కించుకొని ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు దక్కాయి. అయితే వాసుపల్లి గణేష్ కుమార్(వైజాగ్ సౌత్), కరణం బలరాం(చీరాల), మద్దాలి గిరి(గుంటూరు పశ్చిమ), వల్లభనేని వంశీ(గన్నవరం) వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటువేయడంతో అనురాధ గెలుపొందారు.












Click it and Unblock the Notifications