ఢిల్లీకి కొణతాల, బీజేపీలోకి?: కన్నాపై రాయపాటి
విశాఖ/హైదరాబాద్: మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ నేత కొణతాల రామకృష్ణ శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు. జగన్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఆయన బీజేపీలో చేరతారని కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొణతాల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్న కొణతాల మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. ఆయన కుమార్తె ఢిల్లీలో చదువుకుంటున్నారని, ఆమెను చూసేందుకే వెళ్తున్నారని కొణతాల వర్గం చెబుతుండటం గమనార్హం.

కన్నాకు బలముంటే ఓడిపోయారేం: రాయపాటి
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీని పైన ఎంపీ రాయపాటి సాంబశివ రావు స్పందించారు. కన్నాకు నిజంగానే బలం ఉండి ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
సీలేరు పర్యటనకు ఎమ్మెల్యే ఈశ్వరికి అనుమతి నిరాకరణ
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సీలేరు పర్యటనకు జీకేవీధి పోలీసులు అనుమతించలేదు. గురువారం సీలేరులో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు పాడేరు నుంచి ఎమ్మెల్యే బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు జీకేవీధిలో ఉదయం నుంచి నిరీక్షించారు.
సుమారు పది గంటలకు జీకేవీధి వచ్చిన ఎమ్మెల్యేతో సీఐ రామకృష్ణ మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులను శివారు ప్రాంతాల పర్యటనలను రద్దు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అయినా ఎమ్మెల్యే వెళ్లేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు, స్థానికులు మరోసారి ఆమెకు పరిస్థితిని వివరించి సీలేరు పర్యటన రద్దు చేయించారు.
అమానుషం: ఎమ్మెల్యే సర్వేశ్వర రావు
ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అప్పారావును వేకువజూమున కిడ్నాప్ చేసి, అరెస్ట్ చేయడం అమానుషమని అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు అన్నారు. పోలీసులు ఓ గిరిజనుడు, ఉన్నత విద్యనభ్యసించి యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వారిని ఈ విధంగా ఎటువంటి వారెంట్ జారీ చేయకుండా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.
సంబంధిత వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా కనీసం ఆయన భార్యకు సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలో ఉంచడం ఏమిటని, వెంటనే ఆయన విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి టి నాగేశ్వరరావు, మాజీ గిరిజన ఉపాధ్యాయసంఘం ఉపాధ్యక్షుడు బిబి నాగేశ్వరరావులు గురువారం అరెస్ట్‌ను నిరసిస్తూ ఖండించారు.












Click it and Unblock the Notifications