దురాలోచన: చంద్రబాబుపై జగన్ పార్టీ నేత కొణతాల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అభద్రత భావం ఎందుకని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఐదేళ్ల వరకు కుర్చీకి ముప్పు లేకపోతే చంద్రబాబు ఎందుకు ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, ఇటువంటి ప్రక్రియ మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని చెబుతున్న చంద్రబాబు ప్రతిపక్షమే లేకుండా ఉండాలనే దురాలోచనతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెగ రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
కార్యకర్తలకు పోలీసులు దుస్తులు వేసి కూర్చోబెట్టండని, ఇక ఈ ఐదేళ్లు ప్రభుత్వం లేదునుకుందామని ఆయన వ్యంగ్యంగా అన్నారు. శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఇటువంటి దాడులా అని అడిగారు తెలుగుదేశం పార్టీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications