చాలామంది మారారు: తెరాసలోకి కొండా సురేఖ, లాజిక్
హైదరాబాద్: తెలంగాణ పునర్ నిర్మాణం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనే సాధ్యమని భావించి తాము ఆ పార్టీలో చేరుతున్నామని, ఇప్పటి వరకు చాలామంది చాలా పార్టీలు మారారని మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ నేత కొండా సురేఖ మంగళవారం అన్నారు. కెసిఆర్‌తో భేటీ అనంతరం సురేఖ, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ పునర్ నిర్మాణం కెసిఆర్‌తోనే సాధ్యమన్నారు. కెసిఆర్ వల్లనే ఉద్యమం ముందుకు సాగిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు చాలామంది చాలా పార్టీలు మారారన్నారు. తాము పదవుల కోసం పార్టీలు మారలేదని, పదవులు వదులుకొని పార్టీలు మారమన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు. గతంలో సిద్ధాంతపరంగా మాత్రమే తాము విభేదించామన్నారు.

ఇప్పుడు పునర్ నిర్మాణం కెసిఆర్‌తో సాధ్యమని నమ్ముతున్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం కోసమే కెసిఆర్ పోరాటమన్నారు. పార్టీ మారడంపై ఆమె లాజిక్ లాగారు. మీ రిపోర్టర్లు అంతా ఎప్పుడు ఓకే ఛానళ్లో పని చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీలో ఉండగా తాను తెరాస శ్రేణులపై మాట్లాడి ఉండవచ్చునని, ఇప్పుడు తాను నూటికి నూరుపాళ్లు కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్ నిర్మాణం కోసం సైనికుడిలా పని చేస్తానన్నారు.
కెసిఆర్ భవిష్యత్తు ప్రణాళిక నచ్చడం వల్లే తెరాసలో తాను, తన భర్త మురళి బేషరతుగా చేరుతున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ బలమైన నాయకత్వంతోనే సాధ్యమని సురేఖ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సైనికుల్లా పని చేస్తామని తెలిపారు. గతంలో కెసిఆర్‌ను అపార్థం చేసుకున్నామని చెప్పారు. మానుకోట ఘటన కావాలని చేసింది కాదని, జగన్ సమైక్యవాది అని మద్దతివ్వలేదని, ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
కలిసి పని చేద్దామనే: కెటిఆర్
తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో కలిసి పని చేయాలనే ఉద్దేశ్యంతోనే కొండా సురేఖ పార్టీలో చేరుతున్నారని కెటి రామారావు అన్నారు. పునర్ నిర్మాణం కెసిఆర్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కొండా సురేఖ చేరికతో వరంగల్ జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇక నుండి భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు.
సురేఖ ఎఫెక్ట్: కార్యకర్తలతో విద్యాసాగర రావు భేటీ
కొండా దంపతులు తెరాసలో చేరుతున్న నేపథ్యంలో తెరాస వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి విద్యాసాగర్ తన వర్గం కార్యకర్తలతో భేటీ అయ్యారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి టిక్కెట్లు ఇవ్వవద్దని ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.












Click it and Unblock the Notifications