జగన్‌కు షాక్: కొణతాల రాజీనామా, కెసిఆర్‌తో తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మంగళవారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన విషయాన్ని కొణతాల రామకృష్ణ ధ్రువీకరించలేదు.
చాలా కాలంగా కొణతాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల హుధుద్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి జగన్ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన కనిపించలేదు. ఆయన పార్టీకి దూరమైనట్లేనని గత కొంత కాలంగా అనుకుంటూ వస్తున్నారు. ఆయన రాజీనామాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు

తొలి విడతగా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులను వైయస్ జగన్ ఇటీవల నియమించారు. జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకు ఆడిట్ బాధ్యతలు నిర్వర్తించిన విజయ సాయిరెడ్డికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈ జాబితాలో తొలి నుంచి పార్టీకి సేవలందిస్తూ వచ్చిన పలువురు నేతలకు జగన్ షాక్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి నేత దాడి వీరభద్రరావు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కొణతాల రామకృష్ణకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
ఇదిలావుంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. తెరాసలో చేరే విషయంపై తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ మరో శాసనసభ్యుడు తీగెల కృష్ణా రెడ్డితో పాటు తలసాని శ్రీనివాస యాదవ్ తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం కెసిఆర్‌తో చర్చించినట్లు చెబుతున్నారు. టిడిపి శాసనసభ్యులు ధర్మారెడ్డి, తీగెల కృష్ణా రెడ్డి కూడా కెసిఆర్‌తో సమావేశమయ్యారు. పార్టీలో చేరడానికి తేదీని ఖరారు చేసుకునేందుకు ఈ భే్టీ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications