తెలంగాణకు చెడ్డ పేరు, కెసిఆర్ న్యాయం చేయాలి: కొత్తపల్లి గీత
హైదరాబాద్: రాయదుర్గంలోని తమ భూమిని లాక్కున్నారని తెలంగాణ అధికారులపై పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఆరోపించారు. నోటీసు కూడా ఇవ్వకుండా తమ భూములను స్వాధీనం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.
అంతేగాక, ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ సర్కారుకు చెడ్డపేరు వస్తుందని గీత అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భూవ్యవహారానిక సంబంధించిన వివరాలు వెల్లడించారు. అధికారుల తీరుపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆ ఆస్తి తమదేనని ఆమె స్పష్టం చేశారు.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/2లో 53 ఎకరాల భూమిని 8 సంవత్సరాల క్రితం చట్ట ప్రకారం కొనుగోలు చేశామని.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం తమ స్థలంలోకి ప్రవేశించి కాపలాదారులపై దాడి చేశారని.. అనంతరం ఫెన్సింగ్ తొలగించి పెంకుటిల్లును కూలదోశారని తెలిపారు. పార్లమెంటు సభ్యురాలి భూమికే రక్షణ లేకపోతే సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వచ్చే వాళ్లకి ఇలాంటి సంఘటనల ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.












Click it and Unblock the Notifications