ఏపీలో వారికి వరద ముంపు భయం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నీటిని 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు
కృష్ణానదికి వరద ఉధృతి.. అధికారులు అలెర్ట్
విజయవాడ బెర్న్‌పార్క్ వద్ద అప్రమత్తమైన టూరిజం సిబ్బంది పర్యాటకశాఖ బోట్లను నదిలోకి వెళ్లకుండా నిలిపివేశారు. మరోవైపు పెరుగుతున్న వరద ఉధృతితో నదీపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోదావరిలో ప్రస్తుత నీటిమట్టం ఇలా
ఇదిలా ఉంటే గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 10.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉందని, ఈ వరద ప్రవాహం పెరిగి 11.50 లక్షల క్యూసెక్కులకు రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలోనూ, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో నదులలో కొనసాగుతున్న వరద ఉధృతి పై, వర్షాలు, వరదల కారణంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై, రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల పైన సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని, సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టాలని సూచించారు. మరోవైపు వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు.












Click it and Unblock the Notifications