విచారణకు రండి...: మల్లాది విష్ణు తల్లికి కృష్ణలంక పోలీసుల నోటీసులు
అమరావతి: బెజవాడ కల్తీమద్యం ఘటనకు సంబంధించిన విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కృష్ణలంకలోని స్వర్ణబార్‌లోనే మద్యం కల్తీ అయినట్లు నివేదిక రావడంతో బార్ యజమాని మల్లాది శ్రీనివాస్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పోలీసులు షాకిచ్చారు. స్వర్ణబార్‌లో భాగస్వామ్యం ఉన్న మల్లాది విష్ణు తల్లి బాలత్రిపుర సుందరమ్మకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

కల్తీ మద్యం కేసులో విచారణ కోసం శనివారం ఉదయం 10 గంటలకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులలో పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమె ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. దీనిపై బెజవాడలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరోవైపు ఈ కేసులో 9వ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఒడిశాలోని కటక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యంలో మత్తు కోసం స్పిరిట్ కలిపినట్లు క్యాషియర్ వెంకటేశ్వర రావు అంగీకరించినట్లు చెబుతున్నారు.
కల్తీ మద్యానికి సంబంధించి ఆబ్కారీ శాఖకు కెమికల్ రిపోర్టు వచ్చింది. మెయిల్ ద్వారా ల్యాబ్ నుంచి ఆ నివేదికను పంపించారు. స్వర్ణ బార్‌లోనే మద్యంలో కల్తీ జరిగిందని నివేదికలో తేల్చారు. డిపోల నుంచి బార్‌లకు వచ్చిన 9 బ్రాండ్లలో కల్తీ మద్యం లేదని కెమికల్ పరీక్షలో తేలినట్లు చెబుతున్నారు.
చీప్ లిక్కర్‌లో స్పిరిట్ కన్నా శక్తివంతమైన రసాయనం కలిపినట్లు నివేదికలో చెప్పినట్లు సమచారం. విజయవాడలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఐదుగురు మరణించగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications