ఎపికి నీరు విడుదలకు ఆదేశం, పీపీఏలపై టికి ఊరట
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల విడుదల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మంగళవారం చర్చలు జరిపింది. ఇరు రాష్ట్రాల అధికారులతో చైర్మన్ మాట్లాడారు. ఈ భేటీలో తమకు పదివేల క్యూసెక్కుల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగగా.. మధ్యేమార్గంగా.. ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించారు.
భేటీ అనంతరం ఎపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారని, పది టీఎంసీల నీరు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించిందని చెప్పారు. డెల్టాకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున వారం పాటు నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారన్నారు.

రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలసంఘం చైర్మన్ మాట్లాడారని చెప్పారు. తుంగభద్ర నుండి సాగర్ వరకు ప్రాజెక్టుల వారీ ప్రాధాన్యతపై బోర్డు చర్చిస్తుందన్నారు. వారంలోగా కృష్ణా బోర్డు మరోసారి భేటీ అవుతుందని చెప్పారు. మిగిలిన నీటికి సంబంధించిన అంశంపై బోర్డు చర్చిస్తుందని తెలిపారు. తుంగభద్ర నుండి సాగర్ వరకు ప్రాజెక్టులపై ప్రాధాన్యత వారీగా బోర్డు చర్చిస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... విభజన నియమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉల్లంఘిస్తోందని ఎస్ఆర్ఎల్‌డీసీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో స్టేటస్ కో పాటించాలని ఎస్ఆర్ఎల్ డీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఇరు రాష్ట్రాల తమ వాదనలు ఎస్ఆర్ఎల్‌డీసీ ముందు వినిపించాయి. దీనిని కేంద్రం దృష్టికి తీసుకు పోతామని ఎస్ఆర్ఎల్‌డీసీ చెప్పింది. అప్పటి వరకు యథాస్థితిని కొనసాగించాలని సూచించింది.












Click it and Unblock the Notifications