మోడీని తట్టుకున్నాం, బాబుకు శుభాకాంక్షలు: కెటిఆర్
హైదరాబాద్: సీమాంధ్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీకే పట్టం కట్టారని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తారక రామారావు, ఐదేళ్లలో ప్రజల సేవ చేస్తామని చెప్పారు. మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పారు.

పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ హవాను తట్టుకున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని చెప్పారు. నరేంద్ర మోడీకి కూడా తాను శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. మోడీతో కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తమ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టిన ప్రజలకు తాము రుణపడి ఉంటామని టిఆర్ఎస్ పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు.
కాగా, ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక స్థానాల్లో ఆధిక్యతను చాటుకుంది. 65 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 28 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. లోకసభ స్థానాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యతను చాటుకుంటోంది. తెలంగాణలో 11 లోకసభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications