జగన్ కుప్పం ఫోకస్-మంగళగిరితో చంద్రబాబు కౌంటర్-లోకేష్ రిటర్న్ గిఫ్ట్-ఆర్కే స్ధానంలో మురుగుడు ?
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరు నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో పరస్పరం ప్రత్యర్ధి పార్టీల్ని దెబ్బతీసుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు పార్టీల అధినేతల్ని వారి సొంత నియోజకవర్గాల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు కుప్పాన్ని జగన్ టార్గెట్ చేస్తుంటే తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా చంద్రబాబు కూడా జగన్ కు ప్రతిష్టాత్మకమైన మంగళగిరిపై ఫోకస్ పెట్టారు. ఇందులో వారి ఎత్లులు,పై ఎత్తులు రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

కుప్పంపై జగన్ ఫోకస్
చంద్రబాబు వరుసగా విజయాలు సాధిస్తున్న టీడీపీ కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంపై వైసీపీ, జగన్ తాజాగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కుప్పంలో జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న వైసీపీ ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ పోరుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది. ఆయన ఎలాగైనా చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలో దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కి హైకోర్టుతో చీవాట్లు కూడా పెట్టించుకుంటున్నారు.

మంగళగిరిపై ఫోకస్ తో చంద్రబాబు కౌంటర్
ఎప్పుడైతే తన నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టిందో అప్పుడే సీఎం జగన్ కు ప్రతిష్టాత్మకమైన మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఫోకస్ పెట్టేశారు. అంతే కాదు తాజాగా జరిగిన పరిషత్ పోరులోనూ మంగళగిరిని అనూహ్య విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో టీడీపీ సాధించిన విజయాలు ఇప్పుడు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజధాని ప్రజలకు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాైరెడ్డి కంటగింపుగా మారిపోయారు. దీంతో వైసీపీ పరిస్ధితి మంగళగిరిలో నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

నారా లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఛాలెంజ్
ఇదే కోవలో తాజాగా టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని టార్గెట్ చేసి దాడి చేశాయి. దీని తర్వాత టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు దీక్షలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. జగన్ టార్గెట్ గా పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో మంగళగిరిలో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని సవాల్ విసిరారు. ఇప్పటికే అక్కడ దుగ్గిరాలతో పాటు పలు గ్రామాల్లో మరోసారి టీడీపీ జెండా ఎగిరిన నేపథ్యంలో లోకేష్ సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో లోకేష్ ఛాలెంజ్ పై వైసీపీలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.

ఆత్మరక్షణలో జగన్ ?
ఓవైపు చంద్రబాబును కుప్పంలో ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీసేందుకు కీలక వ్యూహాలు పన్నుతున్న జగన్ కు తన క్యాంపు ఆఫీసు ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కష్టంగా మారబోతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తాజాగా పరిషత్ ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో ఎమ్మెల్యే ఆర్కేపై వ్యతిరేకతకు తోడు, స్ధానికంగా వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు జగన్ ను కలవరపెడుతున్నాయి. తన క్యాంపు ఆఫీసు సమీపంలో ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు ఇతర చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. దీంతో మంగళగిరిని తిరిగి నిలబెట్టుకోలేకపోతే చంద్రబాబును కుప్పుంలో దెబ్బతీసినా జగన్ కు ఆ సంతోషం మిగిలేలా లేదు.

మంగళగిరిలో ఆర్కే స్ధానంలో మురుగుడుకు ఛాన్స్ ?
ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్కే ఆర్కేపై రాజధాని అంశం తీవ్ర వ్యతిరేకత పెంచుతోంది. అదే సమయంలో రాజధానిపై ఆర్కే చేస్తున్న ప్రకటనలు స్ధానికుల్లో తీవ్ర ఆగ్రహంరేపుతున్నాయి. దీంతో భవిష్యత్తు సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని జగన్ తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మురుగుడు హనుమంతరావును వైసీపీ తరఫున స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తద్వారా భవిష్యత్తులో మంగళగిరిలో పరిస్ధితులు మరింత విషమిస్తే ఆర్కే స్ధానంలో బీసీ నేత అయిన మురుగుడు హనుమంతరావును అక్కడి నుంచి రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications