వైసీపీకి కర్నూలు ఎంపీ గుడ్ బై- పార్టీకీ, ఎంపీ పదవికీ..!
ఏపీలో ఎన్నికల వేళ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీలో చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత సీట్లు లభించని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో కర్నూలు వైసీపీ ఎంపీ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అంతే కాదు వైసీపీనీ వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలో లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా సమర్పిస్తానని వెల్లడించారు.

వైసీపీలో చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి ఎంపీగా పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ కు మొండిచేయి తప్పదని తేలిపోయింది. దీనిపై సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సంజీవ్ కుమార్ ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కర్నూలు జిల్లాలో చేపడుతున్న మార్పుల్లో మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా ఈసారి టికెట్ కష్టంగా మారింది. అయితే కర్నాటకలో మంత్రిగా ఉన్న నాగేంద్రకు సోదరుడైన జయరాం అక్కడి నుంచి లాబీయింగ్ చేయించుకుని ఎంపీగా సీటు ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నాగేంద్రకు బద్ధశత్రువైన బీజేపీ మాజీ మంత్రి శ్రీరాములు ఈసారి జయరాంకు ఎంపీ టికెట్ దక్కకుండా పట్టుబట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ పోరులో సీఎం జగన్ జయరాంకు ఎంపీగా సీటు ఖరారు చేశారు. దీంతో సంజీవ్ కుమార్ కు అవకాశం లేకుండాపోయింది.












Click it and Unblock the Notifications