రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఆసక్తి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు రానుండటంతో, ఈ బిల్లుపై డివిజన్ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు.
ఒకవేళ ఈ బిల్లుపై ఓటింగ్‌కు అనుమతిస్తేనే తాము సభలోకి వస్తామని చెబుతూనే, రాజ్యసభ మొదలవడానికి ముందే నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిర్ణయించారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే బిల్లుపై ఓటింగ్ జరగని పక్షంలో బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ సైతం ఓటింగ్‌లో పాల్గొని భాగస్వామ్య ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

అయితే కేంద్రంలో టీడీపీ ఎన్డీఏ అధికార భాగస్వామంలో ఉంది. దీనిలో భాగంగా సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి వ్యతిరేకంగా ఓటేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ తీరని అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
అయితే కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో టీడీపీ ఎంపీలు ఏ దిశగా నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. అలా కాకుండా, మూజువాణి ఓటుతో బిల్లు వీగిపోయిందని ప్రకటించే అవకాశం బీజేపీ వద్ద ఉన్నప్పటికీ, అది జరిగితే కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే.
ఇలా జరిగితే రాష్ట్రంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నిజానికి ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తికి క్యాబినెట్ హోదా కలిగి ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. ఇప్పటి వరకు సుమారు 200కు పైగా ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెడితే కేవలం 14 మంది ఆమోదం పొందాయి.
ఈ నేపథ్యంలో ఓ ఎంపీగా ఉన్న కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఏమవుతుందన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications