విద్యుత్‌లో పెట్టుబడికి ఎల్ అండ్ టీ: 2గ్రామాలు దత్తత, బాబు హామీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చైర్మన్, ఎండీ వైఎం దూస్థలి శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు చంద్రబాబుతో ఎల్ అండ్ టీ చైర్మన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద రెండు గ్రామాలను దత్తత తీసుకుంటామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థల సేకరణ, అనుమతులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయనకు హామీ ఇచ్చారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన జపాన్, సింగపూర్ దేశాల పర్యటనలకు వెళ్లారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు కూడా వెళ్లారు. పారిశ్రామికవేత్తలకు తాయిలాలు కూడా ఇస్తున్నారు.
'త్వరలో దుర్గగుడి సమీపంలో ఫ్లై ఓవర్ నిర్మాణం'
విజయవాడలోని దుర్గ గుడి వద్ద కొత్త ఏడాదిలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం వేరుగా చెప్పారు. ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గ ఆలయంలో 2015 క్యాలెండర్‌ను దేవినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. దుర్గ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు.












Click it and Unblock the Notifications