భర్తను చంపేందుకు లేడీ టెక్కీ సుపారీ: ఎందుకు, ఎలా...
తన భర్తను కిరాయి హంతకులతో చంపించడానికి చేసిన లేడీ టెక్కీ ప్రణాళిక ఎదురు తిరిగింది. తల్లి సహకారంతో ఆమె తన భర్తను చంపించడానికి పథకం వేసింది. ఈ కేసును పోలీసులుఛేదించారు.
అనంతపురం: తన భర్తను కిరాయి హంతకులతో చంపించడానికి చేసిన లేడీ టెక్కీ ప్రణాళిక ఎదురు తిరిగింది. తల్లి సహకారంతో ఆమె తన భర్తను చంపించడానికి పథకం వేసింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అనంతపురంలో ఈ సంఘటన చేసుకుంది.
ఎల్‌ఐసీ ఉద్యోగి రాంప్రసాద్‌పై హత్యయత్నం అప్పట్లో సంచలనం అనంతపురంలో సంచలనం రేపింది. ఈ కేసును అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు ఛేదించారు. అతన్ని చంపడానికి భార్య, అత్త కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు బయటపడింది.
వారిద్దరతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలో పోలీసు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మతో కలిసి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఈ అరెస్టుకు సంబంధించిన విషయాలను వివరించారు.

వీరే నిందితులు.
ఎల్‌ఐసీ ఉద్యోగి రాంప్రసాద్‌పై హత్యాయత్నం కేసులో అతడి భార్య కల్యాణి, అత్త విజయలక్ష్మి, తాడిపత్రి పట్టణం నందలపాడుకు చెందిన పెద్దవీరప్పగారి నాగేంద్ర, యల్లనూరు మండలం అచ్యుతాపురం వాసులు బెడుదూరు చిన్నకుళ్లాయప్ప, బెడుదూరు బాలకుళ్లాయప్ప, యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఆరవేటి వెంకటశివుడు నిందితులుగా ఉన్నారు.

అసలేమిటి కథ...
ధర్మవరంలో ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాంప్రసాద్‌కు అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కల్యాణితో 2011లో పెళ్లయింది. కల్యాణి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉండేది. వారాంతంలో ధర్మవరంలో ఉంటున్న భర్త వద్దకు వ చ్చి, వెళ్లేది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో వేర్వేరుగా ఉంటూ వచ్చారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని, దంపతులను ఒకటి చేస్తుండేవారు.

బెంగళూరులో కేసు..
భర్త తనను వేధిస్తున్నాడంటూ రాంప్రసాద్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కల్యాణి బెంగుళూరులో కేసు పెట్టింది. దీంతో కల్యాణికి భర్త నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయనే ఆరోపణలున్నాయి.. తాను భర్త పెట్టే హింసలు భరించలేననీ, ఆత్మహత్య చేసుకుంటానని తల్లితో చెప్పి బాధపడేది. తల్లి విజయలక్ష్మి ఆ విషయాలను తిమ్మంపల్లిలో ఉంటున్న బంధువు వెంకటశివుడికి చెప్పింది. అతడు జోక్యం చేసుకుని పెద్ద మనుషుల సమక్షంలో చేసిన రాజీ ప్రయత్నం ఫలించలేదు.

రాంప్రసాద్ విడాకుల పిటిషన్...
ఆ క్రమంలో 2016లో రాంప్రసాద్ అనంతపురం ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ వేశాడు. ఆ కేసు వాయిదాలకు భార్యాభర్తలు హాజరవుతూ వస్తున్నారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. బెంగుళూరులో కేసు కల్యాణి వాపస్ తీసుకునేలా.. రాంప్రసాద్ విడాకుల నోటీసును రద్దు చేసుకునేలా ఒప్పందం కుదిర్చారు. ఆ మేరకు వాటిని రద్దు చేయించారు కూడా.

దాంతో ఇలా జరిగింది..
ఒప్పందం కుదరడంతో కూతురిని తీసుకుని అనంతపురంలోని అల్లుడి ఇంటికి విజయలక్ష్మి వెళ్లింది. ఇంట్లోకి రావొద్దంటూ వారిద్దరినీ బయటకు గెంటేశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లీబిడ్డలు రాంప్రసాద్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చారు. చంపిన వాళ్లకు రూ.4 లక్షలు, ఒప్పందం కుదుర్చినందుకు రూ.8 లక్షలు ఇస్తామని కల్యాణి తల్లి విజయలక్ష్మి.. బంధువు వెంకటశివుడికి చెప్పింది. ఆ మేరకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. నాగేంద్ర, చిన్నకుళ్లాయప్ప, బాలకుళ్లాయప్పకు సుపారీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి రాంప్రసాద్ ఫొటో అందజేశారు.

ఇలా హత్యాయత్నం...
అనంతపురంలోని కోర్టుకు ఈనెల 14న రాంప్రసాద్ వస్తాడని అత్త విజయలక్ష్మి కిరా యి హంతకులకు సమాచారమిచ్చింది. కిరాయి హంతకులు ముగ్గురూ టూవీలర్‌పై వచ్చారు. అదేరోజు మధ్యాహ్నం రాంప్రసాద్ కోర్టు నుంచి బయటకు వచ్చి, తన టూవీలర్‌పై బయల్దేరాడు. ఆ ముగ్గురూ అతడిని అనుసరించారు. రాంనగర్‌లోని కోకోకోలా గోదాము సమీపంలో ఎవరూ లేకపోవడంతో రాంప్రసాద్ టూవీలర్‌నను ఢీ కొట్టారు. అతడు కింద పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే చిన్నకుళ్లాయప్ప పిడి బాకుతో రాంప్రసాద్ మెడపై పొడిచాడు. దీంతో అతడు గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. అతడి అరుపులు విని స్థానికులు బయటకు వచ్చారు.

పోలీసులు గమనించడంతో.
అటుగా జీపులో వెళ్తున్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ దస్తగిరి, కానిస్టేబుల్ కుమార్ - ముగ్గురు మనుషులు కలిసి ఒకరిని కింద పడేసి కొడుతుండటంతో వెంటనే పోలీసు సైరన్ మోగించారు. దీంతో దుండగులు భయపడి ద్విచ క్రవాహనంపై పారిపోయారు. రాంప్రసాద్‌ను ఆర్‌ఐ, కానిస్టేబుల్ ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఇలా పట్టుబడ్డారు...
రాంప్రసాద్‌పై హత్యాయత్నం కేసును నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసుకున్నారు. అతడి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో తెలిసిన విషయాల ఆధారంగా నిందితులను నగర శివారులోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ సమీపాన సత్రం వద్ద అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications