కోడలిని పిచ్చిదానిగా చేసేందుకు సగం జట్టు కత్తిరింపు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కోడలిని పిచ్చిదాన్ని చేసేందుకు ఓ అత్త ప్రయత్నించింది. జిల్లాలోని గోలీలపేటలో శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కళావతి అనే మహిళకు ఎనిమిది నెలల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లయి ఏడాది గడవక ముందే కోడలిపై అత్త వేధింపులు ఎక్కువయ్యాయి. కోడలు నచ్చలేదని, కట్నం తక్కువ తెచ్చిందని పెళ్లయిన నెల నుంచే అత్త చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలోనే కోడలిని పిచ్చిదానిగా చిత్రీకరించేందుకు అత్త, ఆడపడచు, భర్త ప్రయత్నించారు. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి నిద్రమాత్రలు కలిపిన పాలను ఆమెతో తాగించారు. ఆమె సృహకోల్పోయాక జుట్టు సగానికి కత్తిరించి ఫెవికాల్‌తో అతికించారు. ఆమెను పూర్తిగా పిచ్చిదానిలా తయారు చేశారు. శనివారం ఉదయం నిద్రలేచిన కళావతి ఆగడాలు భరించలేక చుట్టుపక్కల వాళ్లతో చెప్పింది.

ఆమె పరిస్థితి చూసి చుట్టుపక్కలవాళ్లంతా అత్త,మామలపై దాడికి దిగారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అత్త భాగ్యలక్ష్మి, మామ బాబూరావ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి భర్త సత్యనారాయణ, ఆడపడుచు వెంకటలక్ష్మి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి వాహనం బోల్తా, ఐదుగురు మృతి
ప్రకాశం - కర్నూలు జిల్లాల మధ్యన గల నల్లమల ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి లారీ అదుపుతప్పి బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు. మరో 45మంది గాయపడ్డారు. పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నరసయ్య వివాహం గురువారం శిరీషతో గ్రామంలోనే జరిగింది. మర్లుపెళ్లికి శుక్రవారం రాత్రి భోజనాలు చేసుకుని లారీలో 50మంది బంధుమిత్రులతో కలిసి కర్నూలు జిల్లా గోపవరానికి వెళుతున్నారు.
ఘాట్ రోడ్డులో లారీ అదుపుతప్పి కొండ గోడకు ఢీకొనడంతో బోల్తాపడింది. లారీలో ఉన్న వారందరూ హాహాకారాలు చేస్తూ రోడ్డుపై పడిపోయారు. ప్రమాదంలో ప్రభాకర్, ఏసోబు,తిరుపాలు,మరో మహిళ చనిపోగా, గిద్దలూరు ఆసుపత్రిలో వెంకటయ్య (45) మృతిచెందారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. లారీలోనే అందరితోపాటు ప్రయాణిస్తున్న పెళ్లికొడుకు నరసయ్య, పెళ్లికూతురు శిరీషలు పెద్దగా గాయాలు కాకుండానే బయటపడ్డారు.












Click it and Unblock the Notifications