ఎవరు తప్పించుకోలేరు: లగడపాటి, కొత్త పార్టీపై నో

తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వద్దని తాను గత ఎన్నికలలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి చెప్పానన్నారు. తాను మొదటి నుండి సమైక్యవాదం వినిపిస్తున్నానని అన్నారు. అలాంటి తనను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదన్నారు. సమైక్యవాదం ప్రజల గుండెల్లో నుండి వస్తోందన్నారు. విభజన జరిగితే రాజకీయాల్లో ఉండనని తాను సవాల్ చేశానని, 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.
తాను సమైక్య రాష్ట్రం కోసం తన పార్టీ అధిష్టానాన్ని ఎదిరిస్తున్నానని, విభజన జరిగితే రాజకీయాల్లో ఉండనని సవాల్ చేశానని, వేర్పాటువాదులకు భయపడకుండా హైదరాబాదు వెళ్లినవాడినని, ఎవరికీ, దేనికి భయపడని తాను వ్యాపారాల కోసం విభజన కోసం లాలూచీ పడాల్సిన అవసరం లేదన్నారు. టిడిపి నేతలకు వచ్చే వ్యాపారాలు లాలూచీతోనే వస్తున్నాయా చెప్పాలని ప్రశ్నించారు.
ప్రజాగ్రహం ముందు ఏ పార్టీ నిలబడలేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో జై సమైక్యాంధ్ర అనిపించని నేతలు, సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోట్లాడని నేతలు తన పైన విమర్శలు చేయడమేమిటన్నారు. సమైక్యవాదం బలంగా వినిపిస్తున్న తనను అడ్డుకొని తప్పించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని కానీ ఎవరు తప్పించుకోలేరన్నారు. సిడబ్ల్యూసి తీర్మానాన్ని వ్యతిరేకించిన మొదటి జిల్లా కాంగ్రెసు పార్టీయే అన్నారు.
తాము ఖచ్చితంగా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని, అంతిమ విజయం సమైక్యాంధ్రదే అన్నారు. సమైక్యాంధ్ర కోసం టిడిపి నేతలు ఏమీ చేయం లేదన్నారు. సమైక్యాంధ్ర పైన అధిష్టానం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నది సీమాంధ్ర కాంగ్రెసు నేతలే అన్నారు. పార్టీని లెక్కచేయకుండా తాను సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నానని చెప్పారు. కేబినెట్ నోట్ సిద్ధం చేయడం తప్పే అన్నారు. తాను ఢిల్లీ పెద్దలను కలవలేదన్నారు. కొత్త పార్టీపై అడిగితే లగడపాటి స్పందించలేదు.
జిల్లా కాంగ్రెసు నేతల చర్చలు
మరోవైపు కృష్ణా జిల్లా కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు భేటీ అయి పార్టీని వీడే అంశంపై చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు విభజనకు అనుకూలంగా పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో మనస్తాపానికి గురైన నేతలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వారు పార్టీని వీడే అంశంపై చర్చించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications