పరాయివారి అండతో విభజన: జగన్‌పై లగడపాటి
న్యూఢిల్లీ: పరాయివారి అండను చూసుకుని తమ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. పరాయివారు ఎవరనే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారనేది తెలుస్తోంది. తమను కాంగ్రెసు అధిష్టాన దగా చేసిందని ఆయన అన్నారు. నమ్మిన ప్రజలలకు చేసే న్యాయం ఇదేనా అని ఆయన అడిగారు. కాంగ్రెసు అధిష్టానంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నిప్పులు చెరిగారు.
దిక్కులేని స్థితిలో ప్రజలు రోడ్డెక్కారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చెందిన 15 మంది పార్లమెంటు సభ్యులం రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం అప్రజాస్వామికంగా, చట్టవ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించడం మంచిది కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు సభ్యుడిగా చాలా బాధపడుతున్నానని ఆయన అన్నారు. తాము దగాకు గురయ్యామని అన్నారు. సొంతవారిని దగా చేసి పరాయివారితో లాభపడాలని కాంగ్రెసు అధిష్టానం చూస్తోందని ఆయన అన్నారు.

అందరం కలిసి ఢిల్లీలో పోరాటం చేయాలని, సమైక్యాన్ని కాపాడుకోవడానికి ఇంకా అవకాశం ఉందని ఆయన అన్నారు. రెండు సార్లు యుపిఎ అధికారంలోకి రావడానికి దోహదపడిన రాష్ట్ర ప్రజలను కాంగ్రెసు మోసం చేసిందని ఆయన అన్నారు. పక్షపాతంతో ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలు చెప్పాయి కాబట్టి రాష్ట్రాన్ని విభజించామని అంటున్నారని, ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తారా అని అన్నారు.
రాజీనామా చేసిన ఎంపిలమంతా రాష్ట్రపతిని కలిశామని ఆయన అన్నారు. తాను కాంగ్రెసుకు రాజీనామా చేసి రెండు నెలలు అవుతోందని, రాజకీయాలు వద్దనుకున్నప్పుడు ఏ పార్టీలో ఉంటే ఏమిటని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పోరాటానికి కలిసి రావాలని ఆయన అన్నారు. ఒక్కసారిగా దగా చేసి ప్రజలను ముంచేసిందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రపతిని కలుస్తామని అన్నారు.
తనకు న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మోసపోయారని, బాధతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసినందుకు ఫలితం ఇదా అని అడిగారు. దేశరాజధాని ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని అన్నారు. పార్టీలను, జెండాలను పక్కన పెట్టి పోరాడుతామని అన్నారు. నాయకులు సిగ్గులేకుండా ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారంలోకి రావాలని అనుకుంటోందని ఆయన అన్నారు. మొదటిసారి తన అంచనా తప్పయిందని అన్నారు.












Click it and Unblock the Notifications