ఒప్పందం: కాంగ్‌పై లగడపాటి, హైద్రాబాద్-సమైక్య లాజిక్
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సొంత పార్టీ కాంగ్రెసు పైన బుధవారం నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల ఒడంబికతోనే విభజన జరుగుతోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. విభజన విషయంలో ఎవరికీ ఆందోళన లేదని అయితే, ఎన్నికల ముందు విభజిస్తుండటంతో అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు సమైక్యతతోనే ముడివడి ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నాడు రజాకార్ల ఊచకోతతో తెలంగాణ అట్టుడుకుతుంటే సరిహత్తు సీమాంధ్ర జిల్లాలవారు కేంద్రానికి నివేదించారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రెండు వందల మంది ప్రాణాలు అర్పించారని, ఆ జాబితాను తాను కేంద్రానికి పంపిస్తున్నానని లగడపాటి చెప్పారు.

హైదరాబాదు - సమైక్యంపై లాజిక్
రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన లగడపాటి లాజిక్ లాగారు. తద్వారా పరోక్షంగా అందరూ సమైక్యతనే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాదు రాజధానిగా ఉన్న ప్రాంతంలోనే ఉండేందుకు అన్ని ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపిస్తారన్నారు. అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, విశాఖ, తూర్పు గోదావరి.. ఇలా ఏ జిల్లా వారిని అడిగినా హైదరాబాదుతోనే ఉంటామని చెబుతారన్నారు. తద్వారా అందరూ సమైక్యవాదం వినిపిస్తున్నట్లేనని చెప్పారు. ఎవరు వేర్పాటువాదిగా కనిపించరన్నారు.
రాష్ట్రంలో అరవై శాతం ఆదాయం హైదరాబాదు నుండే వస్తుందన్నారు. అలాంటి హైదరాబాదు నుండి విడిపోయేందుకు ఎవరు అంగీకరించరని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉంటే చిన్న సమస్యను పరిష్కరించుకోవచ్చునని, విభజన జరిగితే ఎన్నో సమస్యలు ఉంటాయన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే విభజన జరగాలన్నారు. ఇలా ఇప్పటి వరకు ఏ రాష్ట్రాన్ని విభజించలేదన్నారు.
ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి సమస్యను తాను పరిష్కరిస్తానని, విభజన వద్దని చెబుతుంటే ఎందుకు ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు విభజించడం దేశానికి నష్టమన్నారు. ఎన్నికల ముందు విభజన అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. తాను సమైక్యవాదినని, వ్యక్తిగత హోదాలో సమైక్యం కోసం నివేదిక ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవద్దని కాంగ్రెసు పార్టీకి హితవు పలికారు.
ఎన్నికల కోసమే విభజన చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని, అలాంటప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు. సమస్యలను పరిష్కరించకుండా విభజన ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications