దమ్ముందా?: అగ్రిగోల్డ్, లోకేశ్ లావాదేవీపై బాబుకు లక్ష్మీపార్వతి సవాల్
విజయవాడ: సామాన్య ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి, వారిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులను కొనుగోలు చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మిపార్వతి ఆరోపించారు. విజయవాడలో సోమవారం ఉదయం జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీలో ఆమె పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ మొత్తం కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని, అందుకే విచారణ సక్రమంగా సాగడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను లోకేష్ కొన్నారని, సంస్థ లావాదేవీలపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇపట్టికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ఆమె సూచించారు.

అలా జరగని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు ఉదయం తుమ్మల పల్లి కళాక్షేత్రానికి భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి జింఖానా మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని రాజకీయ పార్టీలు తమ సంఘీభావాన్ని తెలిపాయి.
ర్యాలీ అనంతరం జింఖానా గ్రౌండ్‌లో బహిరంగ సభ జరగనుంది. అగ్రిగోల్డ్ సంస్ధ నుంచి డబ్బులు ఇప్పించాలంటూ బాధితులు రోదిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరికొందరు బాధితులు అధికార పార్టీ నేతలే బినామీలుగా మారి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
సీఐడీ విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. ర్యాలీ నిర్వహిస్తున్న తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకూ భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications