ఎన్టీఆర్ మృతిపై విచారణ: కెసిఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖ
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడంతో ఆయన మృతిపై వివాదం తెర మీదికి వచ్చింది. ఎన్టీఆర్ మృతిపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కెసిఆర్‌కు ఓ లేఖ రాశారు.
కుట్ర, మోసాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారకులయ్యారని, నెపం తనపై నెట్టి తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మరణం వెనక వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని ఆమె అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కెసిఆర్ తన అభ్యర్థనను మన్నించాలని ఆమె కోరారు.
చంద్రబాబు నాయుడు ఓ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని వాస్తవాలను కప్పిపుచ్చారని ఆమె విమర్శించారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగించాలనిు ఆమె లక్ష్మీపార్వతి తన లేఖ ద్వారా కెసిఆర్‌ను కోరారు.

అచ్చోసిన ఆంబోతుల్లా..
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదికి వదిలారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారంనాడు శ్రీకాకుళంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలపైనా, ప్రజలపైనా టిడిపి కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడి పాలన అలీబాబా అరడజను దొంగలను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద రావు, రోజా, వంగవీటి రాధాకృష్ణ, ధర్మాన కృష్ణదాస్, తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications