బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో మూడు సంస్దలకు కేటాయించిన భూములను రద్దు చేయటంతో పాటు ప్రభుత్వానికి సదరు సంస్ధలకు మధ్య జరిగిన అన్నీ ఒప్పందాలనూ రద్దు చేయాలని చంద్రబాబునాయడు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో గత పదేళ్ళకాలంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో జరిగిన అవినీతిపై విచారణకు చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి బుధవారం ఇదే విషయమై సమావేశం జరిపారు. ఆ తర్వాత పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వాన్‌పిక్, లేపాక్షి హబ్, కెరెటు పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన భూములను రద్దు చేయటంతో పాటు సదరు సంస్దలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన అన్ని రకాల ఒప్పందాలనూరద్దు చేస్తూ, మంత్రివర్గంకు సిఫారసు చేసినట్లు తెలిపారు. మొదటగా వాన్‌పిక్ సంస్ధ గురించి వివరిస్తూ, వాన్‌పిక్ పోర్‌ట్స ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పటి ప్రభుత్వం 18877 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 13 202 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 5675 ఎకరాలను ప్రభుత్వం కేటాయించి నట్లు చెప్పారు.
ప్రకాశం జిల్లాలోని వాడరేవు సీ పోర్టు-గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం సీ పోర్టు మధ్య ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు, అభివృద్ది కోస మని సదరు సంస్ధ ప్రభుత్వం నుడి భూములను తీసుకుందన్నారు. మొత్తంలో భూమిలో 6608 ఎకరాలు ఏపిఐఐసి ద్వారా ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఎకరాకు రూ. 70 వేల నుండి రూ. 1.68 లక్షల మధ్య సంస్ధ ధర చెల్లించినట్లు కూడా చెప్పారు. అయితే, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు, సంస్ధ యాజమాన్యం పొందిన రాయితీలకు ఏ విధమైనపొంతనా లేదన్నారు.
ప్రాజెక్టు మొదలుకాకుండానే ఇతర సంస్ధలకు వాటాలను కూడా యాజమాన్యం కేటా యించేసిందని ఆరోపించారు. సంస్ధ ఏర్పాటులో అవినీతి, ఆక్రమాలు జరిగిన విషయం గుర్తించి, సదరు సంస్ధకు కేటాయించిన అన్నీ అనుమతులనూ రద్దు చేయటంతో పాటు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని కూడా తాము సిఫారసు చేసినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్దాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు తదితరాల కోసం లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రైవే టు లిమిటెడ్‌కు కేటాయించిన భూములను, అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లేపాక్షి హబ్‌కు అప్పటి ప్రభుత్వం పై సంస్ధకు 8848 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. ఇందులో డికెటి భూములు 58 11 ఎకరాలను ఎకరాకు రూ. 1.75 లక్షలు, 3032 ఎకరాలు ఎకరాకు రూ. 50 వేలకు కేటాయించినట్లు తెలిపారు. ధర కేటాయింపులోనే అవినీతి జరిగిన విషయాన్ని తాము గుర్తించామన్నారు. డికెటి ధరకన్నా ప్రభుత్వ భూమి ధర ఎక్కువుండాలన్నారు.
మొత్తం ధర రూ. 17.52 కోట్లను సదరు సంస్ధ ప్రభుత్వానికి చెల్లించగా, ఆ మొత్తంపై సర్వీసు పన్ను 15 శాతం వసూలు చేయాల్సి వుండగా, ప్రభుత్వం కేవలం 2 శాతం మాత్రమే వసూలు చేసిందన్నారు. ఈ విధంగా మినహాయించిన సర్వీసు పన్నే సుమారు రూ. 15 కోట్లుగా మంత్రి వెల్లడిం చారు. అంతేకాకుండా చెల్లిచాల్సిన ప్రాసెస్ ఫీజు రూ. 8.24కోట్లు కూడా చెల్లిం చలేదన్నారు. 1.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన సంస్ధ నిర్మాణమే మొదలుపెట్టలేదన్నారు.
భూములు కేటాయిస్తే రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్న సంస్ధ అసలు నిర్మాణమే మొదలు పెట్టకపోగా కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని రెండు బ్యాంకుల్లో రూ. 870 కోట్లకు తనఖా పెట్టినట్లు మంత్రి ఆరోపించారు. అయితే, సదరు మొత్తం లో రూ. 265 కోట్లు తిరిగి చెల్లించేసినట్లు కూడా పేర్కొన్నారు. భూములు తీసు కున్న ఉద్దేశ్యం నుండి సంస్ధ పూర్తిగా వైఫల్యం చెందటంతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేసిన కారణంగా భూముల కేటాయింపును రద్దు చేయటంతో పాటు చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేస్తూ, సిఫారసు చేసినట్లు చెప్పారు. అదే విధంగా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మవరం, ముమ్మడి గ్రామాల్లో కెరెటి పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 814 ఎకరాలను కూడా రద్దు చేయాలని సిఫారసు చేసినట్లు మంత్రి పేర్కొన్నా రు.
ఈ సంస్ద పై గ్రామాల్లో 1980 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందన్నారు. ఎకరాకు సంస్ధ రూ. 80 వేలు చెల్లించిందన్నారు. 2009లో ఒప్పందాలు చేసుకున్న సంస్ద, రెండేళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. అయితే, ఉత్పత్తి మాట అటుంచి సంస్ధలో కెరెటి, కృష్ణపట్నం పోర్టుసిటి యాజమాన్యానికి వాటాలను అమ్మేసినట్లు ఆరోపించారు. ఈ కారణంగానే ప్రభుత్వం సంస్దతో ఒప్పందాలు రద్దు కూడా చేసుకుంటూ మంత్రివర్గానికి సిఫారసు చేసిందన్నారు.
అంతేకాకుండా, వచ్చే సమావేశంలో తాము సమీక్షించనున్న సంస్దల వివరాలను కూడా మంత్రి బుధవారమే ప్రకటించటం గమనార్హం. వచ్చే సమావేశంలో మంగపేట బెరై టీస్, శ్రీకాకుళంజిల్లాలో కన్నెధార కొండపై కేటాయించిన భూములు, పేదల కోసం కేటాయించిన 2657 ఎకరాలతో పాటు శ్రీకాకుళం శివారు ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన 2.7 ఎకరాలు అన్యాక్రాంతమైన వైనం, శ్రీకాకుళం జిల్లాలోనే నాగార్జున విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయించిన భూములు, అనంతపురం జిల్లాలో మేఘమధనం కోసం చేసిన ఖర్చు, విశాఖపట్నం జిల్లాలో రాంకీ ఫార్మసీకి కేటాయించిన భూముల వ్యవహారాలపై సమీక్షించనున్నట్లు మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications