సీఎం జగన్ కీలక నిర్ణయం - ఫించన్ల పునరుద్దరణ, భారీగా లబ్దిదారులు..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను నాలుగేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు. గతంలో పథకాల లబ్ది దారులుగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలతో మధ్యలో నిలిచిన వారికి అర్హతను పునపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి వారికి పథకాలు అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
లబ్దిదారులకు మేలు జరిగేలా
ఏపీలో పథకాల లబ్దిదారుల విషయంలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వైఎస్సార్ ఫించను కానుక కింద గతంలో ఫించను అందుతూ వివిధ కారణాలతో నిలిపివేసిన వాటిని పునపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తనిఖీలో అర్హులుగా తేలితే తిరిగి వారికి ఫించను అందించనున్నారు.

ఈ మేరకు గతంలో ఫించను అందుతూ నిలిపివేసిన వారి వివరాలు గ్రామ, వార్డు సచివాయల్లోని సంక్షేమ కార్యదర్శులకు అందించాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. అర్హత ఉంటే ద్వైవార్షిక చెల్లింపుల్లో కొత్తగా మంజూరు చేయనున్నట్లు జిల్లాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఎన్నికలకు వెళ్లే ముందు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందాలనేది సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఫించన్ల పునరుద్దరణ
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గడపకు అధికార యంత్రాంగాన్ని పంపింది. ప్రతీ ఇంటిని వడపోసింది. తాజాగా జగనన్న సురక్ష ద్వారా ఇటువంటి వారిని గుర్తించింది. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు.
రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మందికి ఇప్పటికే వైఎస్సార్ ఫించను కానుక కింది ప్రతీ నెలా 1వ తేదీ ఉదయమే రూ 2,750 అందిస్తున్నారు. వచ్చే జనవరి నుంచి ఆ మొత్తాన్ని రూ 3000కి పెంచాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు రూ 10 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.
ఎన్నికల వేళ కీలక నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్ ప్రతీ సభలో కోరుతున్నారు. రాష్ట్రంలో 89 శాతం మందికి పథకాలు అందుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పథకాల లబ్దిదారుల సంఖ్య భారీగా పెరగనుంది.
దీని ద్వారా లబ్దిదారులకు మేలు జరగటంతో పాటుగా.. జగన్ ఓట్ బ్యాంక్ మరింత సుస్థిరం కానుంది. రెండో విడత జగనన్న సురక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతీ ఇంటికి లబ్ది చేయాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ సంక్షేమంతో మేనిఫెస్టో ప్రకటించినా...ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన కనిపించ లేదనే అభిప్రాయం ఉంది. దీంతో, ముఖ్యమంత్రి జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు పాలనా పరంగా..రాజకీయంగా కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications