నేనేమైనా ఇల్లీగలా ? NTR ఫంక్షన్ కు పిలవకపోవడంపై లక్ష్మీపార్వతి ఫైర్-పురందేశ్వరిపై శాపనార్దాలు..
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన కేంద్రం.. ఆయన సతీమణి లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై ఆమె ఇవాళ నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.
ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని లక్ష్మీపార్వతి తెలిపారు.
ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.

మీ ఇంట్లో కార్యక్రమం అయితే నన్ను పిలవద్దు...నన్ను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారా లేదా....ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెప్పాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తమ వివాహం పై అన్ని పత్రికలు రాసాయని, ఎన్ని సార్లు తనను అవమానిస్తారని ఆమె నిలదీశారు. తాను ఎన్టీఆర్ భార్య అని బోర్డ్ కట్టుకుని తిరగలా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తనను ఎన్టీఆర్ ఇల్లిగల్ గా పెట్టుకున్నారా అని కూడా లక్ష్మీపార్వతి అడిగారు. ఎన్నాళ్లు ఈ అవమానాలన్నారు.
అలాగే తాను ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే వరకు వైసీపీ తరపున ప్రచారం చేస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు ప్రారంభం అయ్యాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
చంద్రబాబు పురందేశ్వరి ఏకం అయ్యారన్నారు. ఏదో ఒక రోజు పురందేశ్వరి తన కన్నా ఎక్కువ అవమానాలకు గురి అవుతుందన్నారు. కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనుకుంటే పురంధరేశ్వరి అడ్డుకుందన్నారు.

ఇవాళ ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి కేంద్రం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావును ఆహ్వానించింది. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తో పాటు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, ఇలా చాలా మంది హాజరయ్యారు. కానీ లక్ష్మీపార్వతి విషయంలో మాత్రం ఎందుకనో కేంద్రం కినుక వహించింది. దీనికి పురందేశ్వరే కారణమని ఆమె మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications