'ఎన్టీఆర్' రాజకీయం: 18న నిర్వహించనున్న బ్లడ్ డొనేషన్ క్యాంపుపై భగ్గమన్న లక్ష్మీ పార్వతి
హైదరాబాద్: మహానటుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈనెల 18న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపులపై లక్ష్మీ పార్వతి కాస్తంత ఘాటుగానే స్పందించారు. ఈ విషయమై బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఎంతో మంది బతుకుతున్నారని ఆయన భార్య లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట విదేశాలకు వెళ్లి విరాళాలు వసూలు చేస్తున్నారని చెప్పిన ఆమె అలా సేకరించిన విరాళాల మొత్తాన్ని ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
అంతేకాదు తెలుగువారి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ పేరిట ఓ మెమెంటో, శాలువా మాత్రమే ఇస్తున్నారని నగదు పురస్కారం ఎందురు ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఆయన వర్ధంతి నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపు అంటున్నారని, అలా సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు.

బతుకుదెరువు కోసం ఆయన పేరు అందరూ వాడుకుంటున్నారని ఆమె అన్నారు. ఆయన పేరుని వాడుకొని ప్రజలు సహకరించాలని కోరుతున్నారని, సొంతంగా చేయాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారో, ఏం చేస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, ఎన్టీఆర్ 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఈనెల 18న లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు సోమవారం నారా భువనేశ్వరి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మెగా రక్తదానంలో ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొనాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications