Lingamaneni: కారు యాక్సిడెంట్ పై నోరువిప్పిన లింగమనేని, కుమారుడు సంజూష్..!
హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తన పాత్రపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్ (Lingamaneni Sanjush) తో పాటు ఆయన కూడా నోరు విప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ సంజూష్ ఓ ప్రకటన విడుదల చేసారు. అలాగే లింగమనేని రమేశ్ కూడా జరిగిన ఘటన బాధాకరమని, ఇందులో తాము పోలీసులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని, అలాగే బాధితుల్ని ఆదుకునేందుకు కూడా సిద్దమనని ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని లింగమనేని సంజూష్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన భారతి ముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించానన్నారు. వైద్య సాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతి ముఖి మృతి చెందారని తెలిపారు. ప్రమాదం తర్వాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు తను చేసిన ప్రయత్నాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తాను ఎక్కడికీ వెళ్లిపోకుండా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు వెల్లడించారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానన్నారు. పోలీసులు కూడా అన్ని వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి, ప్రమాదానికి ముందు , తరువాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో తన శారీరక పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేశారన్నారు. వీటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చాయన్నారు. వైద్య పరీక్షల ఫలితాలను కూడా ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలతో పాటు దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భారతి ముఖి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో పోలీసులకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని సంజుష్ తెలిపారు.

మరోవైపు ఆయన తండ్రి, జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం, హృదయ విదారకం అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..వారి దుఃఖాన్ని మాటలతో వర్ణించలేం, లేదా తగ్గించలేమన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తన కుటుంబం వారికి అండగా నిలుస్తుందన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని లేదా ముందస్తు అభిప్రాయాలకు రావద్దని కోరారు.
ప్రమాదం తర్వాత తన కుమారుడు బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లడం, వైద్య పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు రావడం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దర్యాప్తుకు తన కుమారుడితో పాటు తాను కూడా పూర్తిగా సహకరిస్తానన్నారు.














Click it and Unblock the Notifications