సీఈసీపై మహా సమరానికి సిద్ధమైన కాక్రోచ్ లు..! డేట్, టైమ్, ప్లేస్ ప్రకటన..!
ఎస్ఐఆర్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరో మహాసమరం ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. గతంలో నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టిన విజయం సాధించిన కాక్రోచ్ లు.. ఈసారి సీఈసీ రాజీనామా కోసం ముంబైలోని శివాజీ పార్క్ వేదికగా ఉద్యమం ప్రారంభించనున్నారు. అక్టోబర్ 2న సాయంత్రం 4 గంటలకు ఈ ఉద్యమం ప్రారంభం కానుందని సీజేపీ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abjijeet Dipke) ప్రకటించారు.
ముంబై శివాజీ పార్క్ లో ప్రారంభించే ఈ నిరసనలకు "ఛలో ముంబై" అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. జ్ఞానేష్ నీ పని అయిపోయిందంటూ (Gyanu It's done bro !) అభిజీత్ దిప్కే ట్వీట్ లో పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ గుర్రం మీద ఉన్న ఫొటోను పైన పెట్టి, కింద కాక్రోచ్ లు ఉద్యమం కోసం కదులుతున్న ఫొటోను కూడా ట్వీట్ తో పాటు దిప్కే షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో సీఈసీ రాజీనామా కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కాక్రోచ్ లు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Chalo Mumbai! #GyanuMustGo pic.twitter.com/VZ0JQKAypE
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 29, 2026
గతంలో నీట్ పరీక్ష అక్రమాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా ప్రారంభించిన ఆందోళనల్ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ వచ్చి వారితో జత కలిశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వంటి వారు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరూ మద్దతిస్తూ పోయారు. చివరికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా కాక్రోచ్ లు జంతర్ మంతర్ లో చేసిన ధర్నా ప్రభావం, పార్లమెంట్ మార్చ్ పేరుతో వారు చేపట్టిన ఆందోళనలు, వారిపై పోలీసులు చేసిన దాడులే ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ పోయింది. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ ల ఉద్యమం విజయవంతం అయింది. ఇప్పుడు సీఈసీ విషయంలోనూ అదే స్దాయిలో పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ యువతను పోగేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అభిజీత్ దిప్కే ఇచ్చిన ఛలో ముంబై పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఎన్నికల సంఘంలో విభేదాల్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టినా, ఈసీ మాత్రం దాన్ని కవర్ చేసుకుంది. ఇప్పుడు కాక్రోచ్ ల ఉద్యమం తర్వాత అయినా సీఈసీ రాజీనామా చేస్తారా లేదా అనేది చూడాలి.














Click it and Unblock the Notifications
