శివుడు రాముడి మధ్య రాజకీయ విభజనా?.. రేవంత్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఒక మీడియా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హిందూ దేవుళ్లైన రాముడు ధనికుల దేవుడు.. శివుడు పేదల దేవుడు అని ఆయన చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎప్పుడూ 'జై శ్రీరామ్' అని అంటారు తప్ప 'హరహర మహాదేవ్' అని ఎందుకు అనరని ప్రశ్నించారు. దక్షిణాది వాళ్లం ద్రావిడులం, శివ భక్తులం కాగా ఉత్తరాది వాళ్లు ఆర్యులు, రామ భక్తులని అన్నారు. శివుడు పేదల దేవుడు, రాముడు సంపన్నుల దేవుడు అని చెప్పి బీజేపీని ధనవంతుల పార్టీగా వర్ణించారు. బీజేపీ రాముడిని చోరీ చేసిందని కూడా ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాముడు, శివుడి మధ్య రాజకీయ విభజన గీతలు గీస్తున్నారని ఆరోపించారు. వేములవాడలో దక్షిణ కాశీ, భద్రాచలంలో దక్షిణ అయోధ్య ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ దేవుళ్లను ఉత్తర-దక్షిణంగా విభజించడం సరికాదని ఆయన అన్నారు.
శివుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడని, కాంగ్రెస్ పార్టీ మాత్రం కులం, ప్రాంతం, ఇప్పుడు దేవుళ్ల మధ్య విభజనలను సృష్టిస్తూ హాలాహలం తయారు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అక్కడ కాశీ విశ్వనాథుడు అంటే శివుడే ఉన్నాడని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సందర్శించిన మొదటి ప్రధాని మోదీనేనని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందినవారని, అక్కడ మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 'హరిహర క్షేత్రం'గా పిలవబడుతుందని బండి సంజయ్ చెప్పారు. ఇది హరి, హరుల ఐక్యతకు ప్రతీక అని, కానీ రాజకీయాల కోసం వాళ్లను వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేసి ఓట్లు తీసుకున్నారని, ఇప్పుడు అదే దేవుళ్లను విభజనకు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
హిందూ సంప్రదాయంలో విష్ణువు శివుని హృదయంలో, శివుడు విష్ణువు హృదయంలో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. అదే సనాతన ధర్మమని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వేములవాడ పర్యటన వీడియోలు, హరహర మహాదేవ్ అంటున్న క్లిప్‌లను కూడా ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న విభజన రాజకీయాలను హిందువులు గుర్తించాలని కోరుతూ 'హరహర మహాదేవ్', 'జై శ్రీరామ్' అంటూ తన పోస్టును ముగించారు.












Click it and Unblock the Notifications
