రైతు రుణ మాఫీ దిశగా సిఎం కెసిఆర్.. రూ. లక్ష కానీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లక్ష రూపాయల లోపు రైతుల రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం కెసిఆర్ సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతుల రుణ మాఫీ పైన చర్చించారు. ఇందుకు సంబంధించి వారం లోగా నివేదిక ఇవ్వాలని కెసిఆర్ బ్యాంక్ అధికారులను కోరారు. వారం తర్వాత వారు పూర్తి వివరాలు అందించాక మరోసారి భేటీ కానున్నారు.
అయితే ప్రభుత్వం గత ఏడాది నుండి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయనుంది. 2013 జూన్ నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు రూ.లక్ష లోపు రుణాల వివరాలు ఇవ్వాలని కెసిఆర్ బ్యాంకు అధికారులను కోరారు. ఈ భేటీలో మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 2013 జూన్‌కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం లేదు.
బ్యాంకర్లతో భేటీ అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదని చెప్పారు. లక్ష రూపాయల మాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. 2013 జూన్ 1 నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు.

కెసిఆర్ హామీతో ఆందోళన విరమించిన ఉద్యోగులు
తాము ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేయమని తెలంగాణ ఉద్యోగులు సి బ్లాక్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బ్యాంకర్లతో సమావేశం అనంతరం కెసిఆర్ బయటకు వస్తూ వారితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

పారిశ్రామికవేత్తలకు హామీ
కేంద్రం ఇచ్చే పన్ను రాయితీ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని కరీంనగర్ ఎంపీ వినోద్ అన్నారు. ఈ విషయం రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే స్పష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పన్ను రాయితీ అనేది అవాస్తవమన్నారు. ఈ అంశంలో పారిశ్రామికవేత్తలు అపోహలకు పోవద్దన్నారు.
హైసెక్యూరిటీ జోన్: నాయిని
హైదరాబాదును హై సెక్యూరిటీ జోన్‌గా మారుస్తామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్‌లో పటిష్ట భద్రత కోసం నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications