ఏడు కొండలస్వామి సాక్షిగా తిరుపతిలో ఏం జరిగిందో తెలుసా, వైసీపీ టూ టీడీపీ
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూమి ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం వేలాది మంది శ్రీవారి భక్తులు తిరుమల వెళ్లడానికి తిరుపతి నగరానికి వచ్చి వెళ్తుంటారు. తిరుపతిలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల ప్రజలు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతిలో పుట్టి పెరిగిన వారి కంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు లక్షలాది మంది నివాసం ఉంటున్నారు.
తిరుపతి నగరంలో సెంటు భూమి కొనాలంటే సామాన్యుడికి చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి తిరుపతి నగరం నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న పాన్ చెరువును ఆక్రమించిన కొందరు పెద్దలు దానిని చదును చేసి ఫ్లాట్లు చేసి విక్రయించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతి నగరంలోని వినాయక సాగర్ సమీపంలోని అన్నమయ్య రోడ్డు మార్గం సమీపంలో తమ్మి నాయుడుపాలెం అనే ప్రాంతం ఉందిం. ఇదే ప్రాంతంలో పాన్ చెరువులో సుమారు రెండు ఎకరాలు ఆక్రమించిన కొందరు వైసీపీ నాయకులు దానిని స్వాధీనం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే మొదలైన ఈతతంగం గురించి తెలిసినా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు దానిని అడ్డుకోకుండా ఆ నాయకుడికి సలాం చేస్తూ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో ఒక ఎకరా భూమి సుమారు రూ. 40 కోట్ల పలుకుతుంది. పాన్ చెరువులో దాదాపు రెండు ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆ నాయకుడు దానిని చదును చేసే ఆక్రమించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాన్ చెరువును కబ్జా చెయ్యడానికి ప్రయత్నాలు చెయ్యడంతో అప్పట్లో తిరుపతి టీడీపీ నాయకులు పాన్ చెరువు కబ్జా కాకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో అప్పటి కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకుని తూతూ మంత్రంగా వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ నాయకుడు కొందరి సహకారంతో పాన్ చెరువును మళ్ళీ ఆక్రమించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాల నుండి గ్రావెల్, మట్టిని తీసుకొచ్చి చెరువును పూడ్చడానికి ప్రయత్నించడంతో స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇప్పుడు గ్రావెల్ కు బదులుగా గ్రానైట్ రాళ్లు, వేస్ట్ మట్టిని తీసుకువచ్చి పాన్ చెరువును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
సుమారు రూ. 70 కోట్ల రూపాయల విలువైన పాన్ చెరువును కబ్జా చేయకుండా అడ్డుకోవాలని తిరుపతి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాశారని సమాచారం. ఈ విషయంపై తిరుపతి రెవెన్యూ శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించి పాన్ చెరువు కబ్జా కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications